NTV Telugu Site icon

Cabinet Berth Offer: రూ.100 కోట్లకు మంత్రి పదవి ఆఫర్.. నలుగురు అరెస్ట్

Cabinet Berth Offer

Cabinet Berth Offer

Cabinet Berth Offer: మహారాష్ట్రలో రూ. 100 కోట్లు చెల్లిస్తే మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని ఊహాగానాల నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. దౌండ్ బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు ఆధారంగా న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. మంత్రివర్గ కసరత్తుకు సంబంధించిన చివరి తేదీ ఇంకా చర్చలో ఉన్నప్పటికీ, పార్టీ అజెండాలో మంత్రివర్గ విస్తరణ చాలా ఎక్కువగా ఉందని, జులై నాలుగో వారంలో జరిగే అవకాశం ఉందని బీజేపీలోని అంతర్గత వర్గాలు తెలిపాయి.

రాజకీయ పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు నలుగురు నిందితులు కేబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తామని ముగ్గురు ఎమ్మెల్యేలను మోసం చేసేందుకు ప్రయత్నించారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. అరెస్టయిన నిందితులు కొల్హాపూర్‌కు చెందిన రియాజ్ షేక్ (41) సంవత్సరాలు, కొల్హాపూర్), యోగేష్ కులకర్ణి (57), సాగర్ సంగ్వాయ్ (37), జాఫర్ అహ్మద్ ఉస్మానీలుగా గుర్తించారు. జులై 12న రియాజ్ షేక్ నుంచి త‌న‌కు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని, ఓ ఆఫ‌ర్‌పై చ‌ర్చించేందుకు మిమ్మల్ని క‌ల‌వాల‌ని రియాజ్ కోరాడ‌ని ఎమ్మెల్యే రాహుల్ కుల్ తెలిపారు. ముంబైలోని హోట‌ల్‌లో క‌లిసిన రియాజ్ త‌న‌కు మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేశాడ‌ని, ఓ సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఈ ప‌ని చేస్తాడ‌ని అందుకు ఆయ‌న‌కు రూ.100 కోట్లు చెల్లించాల‌ని చెప్పాడ‌ని తెలిపారు. 20 శాతం డ‌బ్బును అడ్వాన్స్‌గా చెల్లించాల‌ని రియాజ్ డిమాండ్ చేశాడ‌ని చెప్పారు. అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధమ‌ని మ‌నం త‌ర్వాత క‌లుద్దామ‌ని చెప్పాన‌ని రాహుల్ కుల్ తెలిపారు.

Minister Harish Rao: సొంత ఇంటి స్థలం ఉంటే.. రూ.3 లక్షలు మంజూరు చేస్తాం

ఈలోగా రియాజ్ వ్యవ‌హారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన రాహుల్ ఆపై మెరైన్ డ్రైవ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ వివేక్ ఫ‌న‌స‌ల్కర్ ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. ఇక ఎమ్మెల్యే నుంచి అడ్వాన్స్‌ తీసుకునేందుకు హోట‌ల్‌కు రావాలంటూ నిందితుల‌పై వ‌ల‌ప‌న్నిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాక‌చ‌క్యంగా నిందితుల‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను జులై 26 వ‌ర‌కూ పోలీస్ క‌స్టడీకి త‌ర‌లించారు. వీరు ఇంతకు ముందు మరెవరినైనా మోసం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments