Site icon NTV Telugu

Massive Fraud in LIC: ఎల్‌ఐసీలో భారీ మోసం.. నకిలీ డెత్ సర్టిఫికెట్స్‌తో కోట్లు స్వాహా..

Lic Fraud

Lic Fraud

Massive Fraud in LIC: ఎల్‌ఐసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది.. ఎల్‌ఐసీలో పాలసీ చేస్తే.. తమ సొమ్ము భద్రంగా ఉంటుందని భావిస్తారు.. అయితే, కొందరు ఉద్యోగుల తీరు ఆ సంస్థకు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.. దేశవ్యాప్తంగా విశ్వసనీయతకు మారుపేరైన ఎల్‌ఐసీలో భారీ మోసం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా కందుకూరు ఎల్‌ఐసీ కార్యాలయంలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పూజల శ్రీనివాసరావు.. నకిలీ డెత్ సర్టిఫికెట్లను ఉపయోగించి కోట్ల రూపాయల బీమా క్లెయిమ్స్ స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు.

Read Also: Union Budget Session 2026: పార్లమెంట్‌లో లొల్లి తప్పదా? జీ-రామ్-జీ చట్టం vs ఎంఎన్‌ఆర్‌ఈజీఎపై కాంగ్రెస్ సన్నాహాలు

ఎల్‌ఐసీలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకున్న శ్రీనివాసరావు, వివిధ పాలసీలకు నామినీలుగా తన కుటుంబ సభ్యులను చూపిస్తూ సుమారు 97 నకిలీ క్లెయిమ్స్ దాఖలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ మోసం ద్వారా రూ.3 కోట్లకు పైగా అక్రమంగా పొందినట్లు ఎల్‌ఐసీ అధికారులు నిర్ధారించారు. ఏజెంట్‌గా తన కెరీర్ ప్రారంభించిన శ్రీనివాసరావు, మూడేళ్ల క్రితం డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందాడు. ఈ హోదాను అడ్డం పెట్టుకుని పాలసీ హోల్డర్ల మృతిచెందినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి, క్లెయిమ్స్ మంజూరు అయ్యేలా వ్యవస్థను దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, ఈ స్కాం వెనుక ఉన్న మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ టీమ్‌ను రంగంలోకి దింపారు. ఈ కేసులో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా? నకిలీ పత్రాల తయారీలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఎల్‌ఐసీ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఎల్‌ఐసీ వ్యవస్థలో భద్రతా లోపాలపై చర్చకు దారి తీసింది. భవిష్యత్‌లో ఇలాంటి మోసాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version