Site icon NTV Telugu

Drugs seized: పుష్ప రేంజ్‌లో స్కెచ్‌లు.. ఆటకట్టించిన పోలీసులు

Marijuana

Marijuana

గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప రేంజ్‌లో స్కెచ్‌లు వేసి మరీ దందా చేస్తున్నారు. వేలు కాదు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయల గంజాయిని సరిహద్దులు.. అవసరమైతే దేశాలు దాటించేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి దందా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి ముఠాల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఒడిశాలో ఏకంగా 200 కోట్ల రూపాయల విలువైన హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్ పోర్టులో 23 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్నారు.

పోలీసులు రాకుండా ఉండే చోటు.. దీన్ని గంజాయి హ్యాష్ ఆయిల్ తయారీ కేంద్రంగా ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఒడిశాలోని జోలాపుట్ రిజర్వాయర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పాడువ పోలీస్ స్టేషన్ పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హష్ ఆయిల్ తయారీ యూనిట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో 1800 లీటర్లకు పైగా హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.200 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

ఇక హాష్ ఆయిల్ మాత్రమే కాదు.. అదే ప్రాంతంలో వెయ్యి కిలోలకుపైగా గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.5 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. హాష్ ఆయిల్ తయారీకి ఉపయోగించే యంత్రాలు, డ్రమ్ములు, రసాయన పదార్థాలు, ఇతర సామగ్రిని కూడా సీజ్ చేశారు.

ఈ యూనిట్ ఉన్న ప్రాంతం పూర్తిగా అడవి మధ్యలో ఉండటంతో అక్కడికి చేరుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. రోడ్డు మార్గం లేకపోవడంతో ముందుగా పడవల ద్వారా జోలాపుట్ రిజర్వాయర్ దాటి, అనంతరం పలు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితులకు సమాచారం లీక్ కాకుండా ప్రత్యేక వ్యూహంతో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు ఒడిశా పోలీసులు.

ప్రాథమిక దర్యాప్తులో ఈ హష్ ఆయిల్ తయారీ కేంద్రానికి అంతర్రాష్ట్ర సంబంధాలు ఉన్నట్లు తేలింది. ప్రధాన సూత్రధారులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేశారు పోలీసులు. ఇక అదే జిల్లాలోని నంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో పెద్ద ఎత్తున గంజాయి రవాణా కేసును పోలీసులు వెలికితీశారు. 1143 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.5 కోట్లుగా అంచనా వేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు కొరాపుట్ జిల్లా సెమిలిగూడ ప్రాంతానికి చెందిన సరఫరాదారులు కాగా.. మరో ఇద్దరు హర్యానా రాష్ట్రానికి చెందిన రిసీవర్లు ఉన్నారు.

మరోవైపు ఢిల్లీలో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌‌లో అనుమానాస్పదంగా అనిపించిన రెండు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది. బ్యాగ్ లో కొన్ని ప్యాకెట్లను గుర్తించారు. ఏమాత్రం అనుమానం రాకుండా.. ఆ ప్యాకెట్లను పార్సిల్ కవర్ల మాదిరిగా ప్యాక్ చేశారు. అంటే.. షాపింగ్‌లో కొన్న వస్తువుల మాదిరిగా.. సిల్వర్ కవర్ల లో వాటిని ప్యాక్ చేశారు. స్కానింగ్‌లో ఆ ప్యాకెట్లు కనిపించడంతో.. రెండు బ్యాగులను పూర్తిగా తనిఖీ చేశారు. అందులో ఉన్న ప్యాకెట్లను ఓపెన్‌ చేసి చూడగా షాక్‌..!! గుట్టుచప్పుడు కాకుండా హైడ్రోఫోనిక్‌ గంజాయిని వేర్వేరు ప్యాకెట్లుగా మార్చి.. అనుమానం రాకుండా తరలించే ప్రయత్నం చేశారు ఇద్దరు యువకులు.

బ్యాంకాక్‌ నుంచి వస్తున్న ఆ ఇద్దరూ.. బ్యాంకాక్‌‌లో 23 కిలోల హైడ్రోఫోనిక్‌ గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని అక్కడే ప్యాకెట్లుగా మార్చారు. వాటిని లగేజ్‌ బ్యాగుల్లో ఉంచి ప్యాక్‌ చేసి.. అనుమానం రాకుండా తరలిద్దామనుకున్నారు. కానీ.. ఎయిర్‌పోర్ట్‌ లో భద్రతా సిబ్బంది చేసిన తనిఖీలో అడ్డంగా దొరికిపోయారు…

పట్టుబడ్డ గంజాయి విలువ ఏకంగా 23 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. గంజాయిని సీజ్‌ చేసి.. ఇద్దరిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు కస్టమ్స్‌ అధికారులు. ఢిల్లీకే తీసుకొస్తున్నారా..? ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా తరలించాలని ప్లాన్‌ చేశారా..? అనేది దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Exit mobile version