Site icon NTV Telugu

Bhopal: భార్య చేతిలో మరో భర్త బలి.. బైక్‌పై వెళ్తూ ఏం చేసిందంటే..!

Bike

Bike

ఈ మధ్య భార్యాభర్తల సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. కలకాలం తోడుండాల్సిన భాగస్వాములను అర్థాంతరంగా వదిలించుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న వాడినే కాటికి పంపించేందుకు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో చోటు జరుగుతూనే ఉంటున్నాయి. అనంతరం జైలు పాలై చిప్పకూడు తింటున్నారు. అయినా కూడా మార్పు కనిపించడం లేదు. తాజాగా ప్రియుడి వలలో చిక్కుకుని జీవిత భాగస్వామిని ఓ ఇల్లాలు కడతేర్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్‌(25)కు నాలుగు నెలల క్రితం 17 ఏళ్ల అమ్మాయితో పెళ్లైంది. అయితే ఆమెకు అప్పటికే యువరాజ్ అనే అబ్బాయితో లవ్ ఎఫైర్ ఉంది. రాహుల్‌ తన భార్యతో కలిసి ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసి ఇంటికి బయల్దేరాడు. ఇండోర్-ఇచాపూర్ హైవేలోని ఐటీఐ కళాశాల సమీపంలో తన చెప్పులు పడిపోయాయని భార్య అనగానే వెంటనే బైక్ ఆపాడు. అంతే అక్కడే కాపుకాచిన నలుగురు దుండగులు రాహుల్‌ను అడ్డుకుని పగిలిన బీరు బాటిల్‌తో 36 సార్లు పొడిచారు. దీంతో అక్కడికక్కడే రాహుల్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ప్రియుడు యువరాజ్‌కు వీడియో కాల్ చేసి మృతదేహాన్ని చూపించింది. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని పొలంలో విసిరేసి పారిపోయారు.

ఇక బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం (ఏప్రిల్ 13) పొలంలో మృతదేహాన్ని గుర్తించారు. ఇక భార్యతో కలిసి రాహుల్ బయటకు వెళ్లినట్లుగా పోలీసులకు బాధితుడి కుటుంబం ఫిర్యాదు చేసింది. పైగా భార్య కూడా అడ్రస్ లేకుండా పోయింది. దీంతో పోలీసులకు అనుమానం తలెత్తింది. ఇక పోలీసులు బృందాలుగా ఏర్పడి అమ్మాయితో పాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో నేరాన్ని అంగీకరించారు.

బుర్హాన్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దేవేంద్ర పాటిదార్ ప్రకారం. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న జంట ద్విచక్ర వాహనంపై రెస్టారెంట్‌లో షాపింగ్ చేసి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ హత్య జరిగినట్లుగా చెప్పారు. అమ్మాయి చెప్పులు పడేసినట్లు నటించిందని.. రాహుల్ ద్విచక్ర వాహనాన్ని ఆపుతుండగా ఆమె ప్రేమికుడు యువరాజ్ స్నేహితులు పగిలిన బీరు బాటిల్‌తో 36 సార్లు పొడిచి చంపారని.. రాహుల్ అక్కడికక్కడే మరణించాడని వెల్లడించారు. ఇక మృతదేహాన్ని ప్రియుడికి చూపించేందుకు అమ్మాయి.. యువరాజ్‌కు వీడియో కాల్ చేసిందని తెలిపారు. నిందితులపై హత్య, హత్యకు కుట్ర పన్నడం, ఆధారాలను కప్పిపుచ్చడం వంటి అభియోగాలు మోపారు.

Exit mobile version