Site icon NTV Telugu

Man Executed Lover’s Husband: వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్త హత్య

Man Executed Lovers Husband

Man Executed Lovers Husband

Man Executed Lovers Husband In Kakinada: అతడు ఒక డ్రైవర్. భార్య అంటే అతనికి ఎంతో ఇష్టం. భార్యకు లోటు లేకుండా, ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కానీ, భార్య మాత్రం అతని కళ్లుగప్పి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పని నిమిత్తం భర్త ఇళ్లు వదిలి బయటకు వెళ్లినప్పుడల్లా.. తన ప్రియుడితో కాలం గడిపేది. ఆమె పెట్టుకున్న ఆ వివాహేతర సంబంధం భర్త పాలిట శాపంగా మారింది. అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని మల్లిసాలకు చెందిన బొల్లం శివప్రసాద్ అలియాస్ శివ (27) ఒక వ్యాన్ డ్రైవర్. ఇతడు తన భార్యతో కలిసి సుఖంగా జీవనం సాగిస్తున్నాడు.

అయితే.. శివ భార్య అప్పుడప్పుడు కాట్రావులపల్లిలోని తన పుట్టింటికి వెళ్తుంటుంది. అక్కడే ఆమెకు ఐస్‌క్రీములు అమ్ముకునే అప్పలరాజు అలియాస్ అప్పన్నతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత అది వివాహేతర సంబంధంగా మారింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. వీళ్లు తమ వివాహేతర బంధాన్ని కొనసాగించారు. అయితే.. వేరే ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కి వెళ్లాలని శివ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం అతడు తన భార్యకు చెప్పగా.. ఆమె తన ప్రియుడు అప్పన్నకు తెలియజేసింది. దీంతో.. వాళ్లు హైదరాబాద్ వెళ్లిపోతే, తన ప్రియురాలు దూరమవుతుందని అప్పన్న భావించాడు. ఈ విషయమై శివ భార్య, అప్పన్న మధ్య గంటలకొద్దీ సంభాషణలు జరిగాయి. ఈ క్రమంలోనే శివని హతమార్చాలని అప్పన్న పక్కా స్కెచ్ వేసుకున్నాడు.

తొలుత.. శివ ఇంటికి వచ్చే సమయానికి ఇంటి గేటుకి కరెంటు పెట్టి హతమార్చాలని ప్లాన్ చేశాడు. కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. ఈసారి నేరుగా ఎటాక్ చేద్దామని, అతని ఇంటి వద్దే కాపు కాశాడు. శివ ఇంటికొచ్చి నిద్రపోతుండగా.. అప్పన్న కత్తితో పొడిచి హతమార్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ చేసిన తర్వాత, భార్య పెట్టుకున్న వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో భార్య ప్రమేయం ఉందా? లేక అప్పన్న ఒక్కడే శివ హత్యకు పన్నాగం పన్నాడా? అనే అంశంపై విచారణ జరుగుతోంది. పాపం.. భార్యని ప్రేమగా చూసుకున్న పాపానికి, ఆమె పెట్టుకున్న వివాహేతర సంబంధానికి బలయ్యాడు.

Exit mobile version