Uttar Pradesh: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. ఏకంగా తనను కిడ్నాప్ చేసి, హత్య చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. ఈ వీడియోను తన కుటుంబీకులకు పంపి టెన్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి తన కాళ్లను, చేతులను కట్టేసుకుని, నాలుకను బయటకు తెరిచి, ముఖంగాపై రక్తపు మరకలతో ప్రమాదంలో ఉన్నట్లు వీడియోను క్రియేట్ చేశాడు.
Read Also: Bhatti Vikramarka : ఈ పాదయాత్ర ఎన్నికల కోసమో రాజకీయాల కోసం కాదు
సంభాల్ జిల్లాలోని షాబాజ్ పూర్ కాలా గ్రామానికి చెందిన వసీం అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన యువతితో ఎఫైర్ కలిగి ఉన్నాడు. అయితే ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. ఇరువురు ఇతర కులాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదు. అమ్మాయికి వేరే యువకుడితో ఈ ఏప్రిల్ 24న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ పెళ్లిని ఆపేందుకు కిడ్నాప్, హత్యకు గురైనట్లుగా డ్రామా ఆడి అమ్మాయి కుటుంబీకులను ఇరికించాలని ప్రయత్నించాడు.
ముందుగా దీనికి సంబంధించిన వీడియోను తన సోదరుడికి పంపాడు. ఆ రాత్రి వసీం ఇంటికి తిరిగిరాకపోవడంతో అతని తమ్ముడు, కుటుంబ సభ్యులు అస్మోలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలిక కుటుంబీకులే వసీమ్‌ను హత్య చేశారని ఆరోపించారు. వీడియోను పోలీసులకు చూపించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వసీం డెడ్ బాడీని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎక్కడా ఎలాంటి సమాచారం దొరకలేదు. చివరకు వసీం తన సోదరి ఇంట్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో కిడ్నాప్, హత్య డ్రామా ఆడినందుకు పోలీసులు వసీంను అరెస్ట్ చేశారు.