Palnadu Crime: పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో దారుణహత్య కలకలం సృష్టించింది. స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ ను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. నర్సరావుపేట నుంచి రావిపాడు వెళ్లే రోడ్డులో స్వర్గపురి-2లో ఎఫ్రాన్ కాటికాపరిగా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో నిద్రపోతున్న ఎఫ్రాన్ పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. మెడ, గొంతుపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఎఫ్రాన్ హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిస్టియన్ పాలెంలో నివాసం ఉంటున్న ఎఫ్రాన్ గత ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా పనిచేశారు. ఇది మనసులో పెట్టుకుని అదే వార్డుకు చెందిన ఖాదర్, అతని సోదరులు, అనుచరులు ఎఫ్రాన్ ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఎఫ్రాన్ హత్యకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోద్బలం ఉందంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు
