Site icon NTV Telugu

Black Magic: సంతానం కోసం నరబలి.. వ్యక్తి తల నరికి, హోలీ మంటల్లో మొండం దహనం..

Black Magic

Black Magic

Black Magic: బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి, తంత్ర విద్యకు ఓ వ్యక్తి బలయ్యాడు. అత్యంత దారుణంగా అతడి తల నరికి, మొండాన్ని అగ్నిలో కాల్చేశారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 65 ఏళ్ల యుగుల్ యాదవ్‌గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో తాంత్రికుడి బంధువు కూడా ఉన్నాడు.

ఔరంగాబాద్ ఎస్పీ అమ్రిష్ రాహుల్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గులాబ్ బిఘా గ్రామ నివాసి అయిన యుగుల్ యాదవ్ కనిపించడం లేదని మార్చి 13న ఫిర్యాదు అందిందని, దీనిపై కేసు నమోదు చేసి, ప్రత్యేక టీం ద్వారా దర్యాప్తు జరిపించామని, దర్యాప్తులో పొరుగున ఉన్న బంకర్ గ్రామంలోని ‘‘హోలికా దహన్’’ కార్యక్రమంలో బూడిద నుంచి మానవ ఎముకలు దొరికినట్లు చెప్పారు. ఆ ప్రదేశాన్ని పూర్తిగా గమనించగా కాలిపోయిన మానన ఎముకలు, యుగువల్ చెప్పులు కనిపించాయని వెల్లడించారు.

Read Also: Vivo V50e: అతి త్వరలో స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచేయనున్న వివో V50e

వెంటనే డాగ్ స్క్వాడ్‌ని రంగంలోకి దింపగా, అవి తాంత్రికుడు అయిన రామశిఖ్ రాక్యిసన్ ఇంటికి వెళ్లాయి. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. అతడి బంధువు ధర్మేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని ప్రశ్నించగా.. పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పడంతో, పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా అసలు విషయం తెలిసింది.

ధర్మేంద్ర తాను, ఇతరులు కలిసి చేతబడి ఆచారాల్లో భాగంగా యుగల్‌ని కిడ్నాప్ చేసి, అతడి తల నరికినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత హోలీ మంటల్లో మొండాన్ని కాల్చి వేసినట్లు చెప్పాడు. ధర్మేంద్ర స్టేట్మెంట్ ఆధారంగా సమీపంలోని పొలం నుంచి బాధితుడి తెగిపోయిన తలను స్వాధీనం చేసుకున్నారు. సంతానం కోసం చూస్తున్న సుధీర్ పాశ్వాన్ తరుపున రామశిక్ రిక్యాస్ ఈ కర్మను నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నిందితులు గతంలో ఒక యువకుడిని బలి ఇచ్చినట్లు, అతడి మృతదేహం అదే ప్రాంతంలోని బావిలో పడేసినట్లు ధర్మేంద్ర అంగీకరించాడు. సుధీర్ పాశ్వాన్, ధర్మేంద్ర, మరో ఇద్దరు సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తాంత్రికుడు రామశిక్ రిక్యాసన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానవ ఎముకల్ని డీఎన్ఏ పరీక్షల కోసం పంపారు.

Exit mobile version