Site icon NTV Telugu

Pregnant Woman Attaked: నిండు గర్భిణి దారుణహత్య.. ఆ కక్షతోనే

Man Attack With Sickle

Man Attack With Sickle

Man Attacked On Pregnant Woman With Sickle In Hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. ఆడపడుచు భర్తే వేటకొడవలితో ఆమెను అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. తన మీద భార్య కేసు పెట్టడానికి కారణం వాళ్లేనని కక్ష పెంచుకొని, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ కిరాతకుడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరంకు చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతితో కలిసి కొండాపూర్‌లో ఉంటున్నాడు. 2020లో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి.. తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మి ప్రసన్నకు శ్రీరామకృష్ణతో వివాహం జరిపించాడు. కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కానీ, ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి.

అదనపు కట్నం తీసుకురావాలంటూ లక్ష్మీ ప్రసన్నను శ్రీ రామకృష్ణ శారీరకంగా, మానసికంగా వేధించాడు. అతని వేధింపులు తాళలేక, భర్త తనని వేధిస్తున్న విషయాన్ని ఆమె పెద్దలకు తెలియజేసింది. దీంతో.. గతేడాది పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అప్పుడు తాను మారుతానని శ్రీరామకృష్ణ చెప్పాడు. మొదట్లో కొన్ని రోజులు మారినట్టుగానే నటించాడు కానీ, మళ్లీ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇక సహించేదే లేదని.. శ్రీరామకృష్ణపై భార్య లక్ష్మీ ప్రసన్న చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే.. తన భార్యతో ఇదంతా వెంకట్ రామకృష్ణ దంపతులే చేయిస్తున్నారని వారిపై శ్రీరామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. ముఖ్యంగా.. వెంకట్ రామకృష్ణపై పగ పెంచుకున్న శ్రీరామకృష్ణ, అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. ఎర్రగడ్డలో వేడకొడవలి కొన్నాడు.

ఈనెల 6వ తేదీన శ్రీరామకృష్ణ ఆ వేటకొడవలి తీసుకొని, కొండాపూర్‌లో ఉంటోన్న బామ్మర్ది ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన కుమార్తెను స్కూలు నుంచి తీసుకురావడానికి వెంకట్ రామకృష్ణ బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి.. శ్రీరామకృష్ణ చేతిలో ఉన్న వేటకొడవలిని చూసి, కేకలు వేస్తూ బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. శ్రీరామకృష్ణ ఆమెపై దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన స్రవంతిని ఆసుపత్రికి తరలించగా.. అదే రోజు రాత్రి 11 గంటలకు చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు శ్రీరామకృష్ణను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version