Diwali Gift: దీపావళి రోజు గిఫ్ట్ ఇవ్వని కారణంగా చెలరేగిన వివాదం ఒకరి హత్యకు కారణమైంది. తన యజమాని నుంచి దీపావళి రోజు ఏదో ఒక గిఫ్ట్ వస్తుందని భావించిన వ్యక్తిని నిరాశ ఎదురుకావడంతో, అతను తన యజమానికి ఫోన్ చేసి దుర్భాషలాడటంతో హత్య జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీపావళి గిఫ్ట్ ఇవ్వలేదని 27 ఏళ్ల వ్యక్తి తన యజమానిని తిట్టాడు. దీంతో యజమాని తన స్నేహితులతో కలిసి అతడిని హత్య చేశారు.
నితేష్ థాకరే అనే వ్యక్తి చంద్రపూర్‌లో తమలపాకుల దుకాణం నిర్వహిస్తున్న 25 ఏళ్ల సుజిత్ గన్వీర్ వద్ద పనిచేసే వాడు. దీపావళి సందర్భంగా థాకరే తన యజమాని నుంచి కొత్త బట్టలు లేదా మరేదైనా గిఫ్ట్ వస్తుందని ఆశించాడు. అయితే, థాకరేకి తన యజమాని నుంచి ఎలాంటి బహుమతి రాలేదనే కోపంతో, గన్వీర్‌కు ఫోన్ చేసి తిట్టాడు.
కోపంతో గన్వీర్ తన స్నేహితులతో కలిసి థాకరేని చంపడానికి పథకం వేశారు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి గన్వీర్ ఆన్‌లైన్ నుంచి కత్తిన ఆర్డర్ చేసి, సినిమా చూద్ధామని థాకరేను బయటకు తీసుకెళ్లాడు. చంద్రపూర్‌లోని ఒక లా కాలేజీ వెనక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. గన్వీర్ మరో ఐదుగురు నిందితులు థాకరేని కొట్టి, పొడిచి చంపారు. నిందితులు ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఆరుగురు నిందితులు-కరణ్ మెష్రామ్ (22), యశ్ ఛోటేలాల్ రౌత్ (19), అనిల్ రామేశ్వర్ బోండే (22), ప్రతీక్ మాణిక్ మెష్రామ్ (22), తౌసిఫ్ షేక్ (23), సుజిత్ గన్వీర్ (25)లను గంట వ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేశారు.
