Site icon NTV Telugu

MBNR WIFE MURDER : రాంగ్ కాల్‌తో మొదలైన ప్రేమ.. చివరికి అటవీ ప్రాంతంలో భయంకర మలుపు

Murder

Murder

MBNR WIFE MURDER : రాంగ్ కాల్‌లో పరిచయం…. ఆపై ప్రేమ ….పెళ్లి … పిల్లలు …ఇలా సంతోషంగా సాగుతున్న జీవితంలో భార్య తప్పటడుగులు…. భర్త పెంచుకున్న అనుమానంతో , ప్రేమించి పెళ్లాడిన భార్యను దారుణంగా హతమార్చి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. ఈ ఘటన పాలమూరు జిల్లాలో సంచలనం కలిగించింది. ప్రేమించి పెళ్లాడిన భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే కారణంతో భర్త కిరాతకుడిగా మారాడు. సోమశిల చూసొద్దామని ఆమెను నమ్మించి తీసుకెళ్లి, అటవీ ప్రాంతంలో చున్నీతో గొంతు నులుమి, ఆ పై కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ తరువాత మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ అటవీ ప్రాంతంలో జరిగింది…

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని లింగాల మండలం రాయవరానికి చెందిన శ్రీశైలం …. ధన్వాడ మండలం గోటూరుకు చెందిన శ్రావణికి రాంగ్ కాల్ ద్వారా ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. అలా తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడి 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఐదేళ్ల పాటు సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితంలో శ్రావణి వేసిన తప్పటడుగు ఆమెకు మరణ శాసనమయ్యింది. పెళ్లయిన ఐదేళ్లకు భర్త, పిల్లలను వదిలేసి శ్రావణి.. తన అక్క భర్తతో వెళ్లిపోయింది. ఏడాది క్రితమే మళ్లీ భర్త వద్దకు వచ్చి పిల్లల భవిష్యత్ దృష్ట్యా కలిసుందామని చెప్పింది. శ్రీశైలం అందుకు అంగీకరించాడు. శ్రీశైలం.. హైదరాబాద్‌లో పనిచేస్తుండగా.. శ్రావణి మహబూబ్ నగర్‌లో ఉంటూ ఓ ప్రయివేటు ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో దంపతులు బాగానే ఉంటున్నారని కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు…

Papaya Side Effects: ఈ 5 సమస్యలున్నవారు బొప్పాయి తినకూడదు

అంతా బాగుందనుకున్న టైమ్‌లో శ్రావణి తరచూ ఫోన్ మాట్లాడడం.. చాటింగ్ చేయడం గమనించాడు శ్రీశైలం. దీనిపై ఆమెతో గొడవపడ్డాడు. శ్రావణి మరొ వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని శ్రీశైలం అస్సలు సహించలేక పోయాడు. పద్దతి మార్చుకోవాలని సూచించాడు. కానీ వినకపోవడంతో ఆమెను హత్య చేయాలని స్కెచ్ వేశాడు. ఆగస్ట్ 21న హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ చేరుకున్న శ్రీశైలం.. భార్యతో సఖ్యతగా ఉన్నట్లు నటించి ఆమెను సోమశిల పర్యాటక ప్రాంతం చూసొద్దాం అని తీసుకెళ్లాడు. మార్గమధ్యంలోని సాతాపూర్ నల్లమల ఫారెస్ట్‌లో దారుణంగా హతమార్చి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు…

శ్రావణిని హత్య చేసేందుకు శ్రీశైలం గత నెల రోజులుగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగానే హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో కత్తి కొనుగోలు చేశాడు. మహబూబ్ నగర్‌లో బాటిల్‌లో పెట్రోల్ పోయించుకున్నాడు. సాతాఫూర్ ఫారెస్ట్ వద్ద సీతాఫలాలు తెంపుకుందామని చెప్పి.. చున్నీతో గొంతు బిగించి, కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు.. తన కూతురు కనిపించడం లేదని శ్రావణి తండ్రి చంద్రయ్య మహబూబ్ నగర్ టూటౌన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. శ్రీశైలంను విచారణ చేయడంతో తనకేమీ తెలియదని బుకాయించాడు. చివరకు తప్పించుకోలేనని తెలిసి పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Rajasthan: వరకట్న పిశాచికి మరొకరు బలి.. కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం

Exit mobile version