Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..

Home Tours

Home Tours

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం తమ వ్యక్తిగత జీవితాలను, సంపదను ప్రదర్శించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ఒక యూట్యూబర్ చేసిన ఇలాంటి ప్రయత్నమే ఆమె ఇంట్లో భారీ దోపిడీకి దారితీసింది. రచనా గుర్జర్ అనే గృహిణికి యూట్యూబ్‌లో ఒక లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవల తన విలాసవంతమైన జీవనశైలిని చూపిస్తూ తన ఇంట్లోని వివిధ గదులను, తలుపులను, భద్రతా ఏర్పాట్లను ‘హోమ్ టూర్’ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాకుండా.. మరో వీడియోలో తన వద్ద ఉన్న భారీ బంగారు, వెండి ఆభరణాలను, నగదును ఒక టేబుల్‌పై పెట్టి మరీ ప్రదర్శించారు. ఈ వీడియోలే దొంగలకు రోడ్‌మ్యాప్‌గా మారాయి.

శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో, గుర్తుతెలియని దొంగలు మోహని గ్రామంలోని రచనా గుర్జర్ ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులను బయట నుండి ఒక గదిలో బంధించారు. ఆపై ఇంట్లోని రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి నగదు, కొంత నగదుతో పాటు ఒక ఎనర్జీ డ్రింక్ కార్టన్‌ను కూడా దొంగిలించారు. తమ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు, ఒక లాఠీ సహాయంతో ఇంట్లోని సిసిటివి కెమెరాల కోణాలను మార్చేశారు.

×
×
Ad

తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన కుటుంబ సభ్యులు, గది బయట నుండి లాక్ చేసి ఉండటాన్ని గమనించి బంధువులకు ఫోన్ చేశారు. వారు వచ్చి తలుపులు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు నర్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలు స్థానికులే అయ్యుంటారని, యూట్యూబ్ వీడియోల ద్వారా ఇంటి లోపలి విషయాలను పూర్తిగా తెలుసుకొని పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో మితిమీరిన వ్యక్తిగత వివరాల ప్రదర్శన ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక హెచ్చరిక.