Site icon NTV Telugu

Loan App Harassment: విషాదం.. లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య

Loan App Suicide

Loan App Suicide

Loan App Operators Harassment Drives Man To Suicide In Nijampet: లోన్ యాప్ వేధింపులకు ఇప్పటివరకూ ఎంతోమంది బలయ్యారు. ఇప్పుడు మరొక వ్యక్తి వీళ్ల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గాంధీ నగర్‌లోని జయదీపిక కేకేఎం ఫేజ్-1 ఆరో ట్విన్ టవర్స్‌లో సిహెచ్ రాజేష్ (35) అనే వ్యక్తి తన భార్య, మూడేళ్ల పాపతో నివసిస్తున్నాడు. నెల రోజుల క్రితమే రాజేష్ బిగ్ బాస్కెట్‌లో ఉద్యోగానికి చేరాడు. ఇటీవల ఇతను లోన్ యాప్‌లో కొంత అప్పు తీసుకున్నాడు. అయితే.. సమయానికి అప్పు తీర్చకపోవడంతో, వాళ్లు వేధింపులు పెట్టడం మొదలుపెట్టారు. తనకు కొంత సమయం ఇవ్వమని వేడుకుంటున్నా.. వాళ్లు పట్టించుకోకుండా తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ టార్చర్ పెట్టారు.

రానురాను వాళ్ల వేధింపులు మితిమీరడంతో, మానసికంగా కుంగిపోయిన రాజేష్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య, పాపను విజయవాడలోని స్వగ్రామానికి పంపించేసి.. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకొని, సూసైడ్ చేసుకున్నాడు. స్వగ్రామంలో ఉన్న భార్య ఎంత ఫోన్ చేస్తున్నా.. రాజేష్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాచ్‌మెన్‌కి ఫోన్ చేసింది. తన భర్తకి ఒక కొరియర్ వచ్చిన విషయాన్ని భర్తకు తెలియజేయమని చెప్పింది. ఆయన వెళ్లి చూడగా.. రాజేష్ ఫ్యాన్‌కి ఉరేసుకుని కనిపించాడు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో మొత్తం పరిశీలించారు. అప్పుడు వాళ్లకి లోన్ యాప్ వేధింపుల వల్లే మరణించాడని తెలిసింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు రాజేష్ వాళ్లు ఎంతలా బాధ పెట్టారో ఒక బోర్డుపై రాశాడు.

‘‘నేను లోన్ యాప్‌లో కొంత అప్పు తీసుకున్నాను. వాళ్లకు డబ్బులు కడుతున్నప్పటికీ, నన్ను రోజూ వల్గర్ బాషతో బాధపెడుతూ వచ్చారు. వాళ్ల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అని రాజేష్ ఆ బోర్డుపై రాసుకొచ్చాడు. అంతేకాదు.. లోన్ యాప్ ద్వారా మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు.

Exit mobile version