Kurnool Supari Murder: దాయాదుల మధ్య ఆస్తి వివాదం హత్యకు దారి తీసింది. చిన్నపాటి ఘర్షణ ప్రాణాల మీదకి తెచ్చింది. సుపారి ఇచ్చి మరీ సొంత వాళ్లనే హత్య చేయించారు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ తెరమరుగైనా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే హత్యలు చేసుకుంటున్నారు.
READ ALSO: Post Master: పోస్టు మాస్టర్ ఇంటికి కన్నం వేసిన అసిస్టెంట్ పోస్టు మాస్టర్.. రూ. 8 లక్షలు చోరీ
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల్లకు చెందిన పద్మనాభ రెడ్డి రాతి దూలం పోటీలకు వెళ్లాలంటే మహా ఆసక్తి. దీంతో వారాలు, నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. అయితే గత మే 13న ఇంటి నుంచి వెళ్లిన పద్మనాభ రెడ్డి.. చాలా రోజులైనా తిరిగి రాలేదు. భార్య శిరీష ఫోన్‌లో ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. కొన్నాళ్లపాటు ఇంటికి దూరంగా ఉండడం మామూలే కదా.. వస్తాడని ఎదురు చూసింది. రోజులు గడుస్తున్నా పద్మనాభ రెడ్డి నుంచి ఫోన్ కానీ, ఎలాంటి సమాచారం కానీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు.. గ్రామంలో పద్మనాభ రెడ్డి దాయదులతో ఆస్తికోసం జరిగిన ఘర్షణ సమాచారం తెలిసింది. ఈ వ్యవహారంపై ఆరా తీస్తే మొత్తం సమాచారం బయటపడింది.
చక్రాల్లలో పద్మనాభ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి దాయాదులు. వారి మధ్య ఆస్తి వివాదం ఉంది. రామకృష్ణారెడ్డికి చెందిన 40 సెంట్ల స్థలాన్ని అమ్మేశాడు. అందుకు అడ్వాన్సుగా రూ.లక్షా 30 వేలు తీసుకున్నాడు పద్మనాభ రెడ్డి. అయితే ఆ స్థలం అమ్మకుండా దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నీ ఇప్పటికే అమ్ముకున్నావని, ఈస్థలాన్ని అమ్మేందుకు తాము అంగీకరించబోమని దాయాదులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలోనే వారి మధ్య ఘర్షణ జరిగింది. రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి మరికొందరితో కలసి పద్మనాభ రెడ్డిపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో దాడిచేయడంతో పద్మనాభరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత ఆటోలో తీసుకువెళ్లి ఆయన తండ్రి ఉండే రాంపురంలో వదిలివేశారు. గాయాల నుంచి తేరుకున్న పద్మనాభరెడ్డి తనపై దాడిచేసిన వారిని వదలబోనని గ్రామస్థులతో చెప్పాడు. దీంతో పద్మనాభ రెడ్డి నుంచి ప్రాణహాని హాని ఉందని భావించిన దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి కలిసి పద్మనాభ రెడ్డి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు…
పద్మనాభ రెడ్డి హత్యకు సర్పంచ్ శ్రీరామలుకు సుపారీ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి. రూ.లక్షా 30 వేలకు సుపారీ మాట్లాడుకున్నారు. మద్యం తాగేందుకు పద్మనాభ రెడ్డిని పిలిచి హత్య చేయాలని ప్లాన్ చేశారు. మద్యం తాగేందుకు అని చెప్పి సర్పంచ్ శ్రీరాములు తమ్ముడు సిద్ధరాముడు, అయ్యన్న, ఎద్దులదొడ్డి శ్రీరాములు, ప్రసాద్ రాంపురం సుంకులమ్మ ఆలయానికి పద్మనాభ రెడ్డిని తీసుకెళ్లారు. మద్యం తాగడం మొదలయ్యాక రాళ్లతో దాడి చేసి లుంగీతో గొంతు బిగించి హత్య చేశారు. పద్మనాభ రెడ్డి డెడ్‌బాడీ అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. డెడ్ బాడీ అక్కడే వదిలేస్తే ప్రాబ్లమ్ అవుతుందని రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి పద్మనాభ రెడ్డి మృతదేహాన్ని ప్యాపిలి సమీపంలోని లంకాయపల్లి చెరువులో పొదల్లో పూడ్చిపెట్టి రాళ్లు పెట్టారు.
లంకాయపల్లి చెరువులో మృతదేహం పూడ్చివేత
పద్మనాభ రెడ్డి అదృశ్యం హత్యగా నిర్దారణకు వచ్చిన పోలీసులు.. దాయాదులు రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి , సర్పంచ్ శ్రీరాములును అదుపులోకి తీసుకుని విచారించారు. పద్మనాభ రెడ్డి సుపారీ హత్యపై నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు లంకాయపల్లి చెరువులో పూడ్చిన మృతదేహం కోసం తవ్వారు. హత్య చేసి చాలా రోజులు కావడంతో పుర్రె, ఎముకలు మాత్రమే లభించాయి. పోలీస్ వాటిని స్వాధీనం చేసుకొని డి ఎన్ ఏ టెస్టు కోసం పంపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మిగతా నిందితులు పరారీలో ఉన్నారు.
READ ALSO: Mother kills Son: బిడ్డల కోసం.. కన్న కొడును చంపేసిన తల్లి
