Red Sandalwood smuggling: ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. శేషాచలం అడవుల నుంచి చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి ద్వారా తరలిపోతోంది. కర్ణాటకకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామాలను స్మగ్లర్లు స్టాక్ పాయింట్లుగా పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి యథేచ్ఛగా విదేశాలకు తరలిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ కనుసన్నల్లో దందా నడుస్తోందంటున్నారు పోలీసులు.
ఇన్నాళ్లూ కాస్త స్తబ్దుగా ఉన్న ఎర్ర చందనం దందా.. మళ్లీ చిగురు తొడిగింది. ఇటీవల బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు సమీపంలోని దండుకుంట పొలాల వద్ద ఓ ఇంట్లో 144 ఎర్ర చందనం దుంగలను పలమనేరు ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. తాజాగా దుంగలు పట్టుబడిన గ్రామం కర్ణాటక రాష్ట్రానికి కూత వేటు దూరంలో ఉంది. శేషాచలం నుంచి హోస్కోటే సమీపంలోని కట్టిగేనహళ్లికి ఎన్నో ఏళ్లుగా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మీదుగానే ఎర్ర చందనం అక్రమ రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన స్మగ్లర్లు ఏపీ సరిహద్దులోని ఆలపల్లి ప్రాంతాన్ని స్టాక్ పాయింట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైవే నుంచి ఈ గ్రామం చాలా దగ్గర్లో ఉంది. ఇక్కడి నుంచి కర్ణాటకలోని చల్లహళ్లి, బైప్పళ్లి, కగ్గనహళ్లిల మీదుగా హైవేలో ఎలాంటి టోల్‌గేట్లు లేకుండా హోస్కోటేకు అడ్డదారులున్నాయి. దీంతో ఇక్కడి నుంచి దుంగలను కర్ణాటకలోని కట్టిగేనహళ్లికి తరలిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.
Off The Record: టీ-కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులు? క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్
కొన్నేళ్లుగా శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్ర చందనం.. కర్ణాటకలోని హోస్కోటే సమీపంలోని కట్టిగేనహళ్లికి చేరుతోంది. ఈ గ్రామం ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పేరు గాంచింది. ఆ గ్రామానికి చెందిన వసీంఖాన్, నదీంఖాన్ అంతర్జాతీయ ఎర్ర స్మగర్లుగా పేరు పొందారు. వీరి అండతో గ్రామస్తులు రెండు దశాబ్దాలుగా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాను వృత్తిగా చేసుకున్నారు. మొత్తంగా గ్రామంలో 20 మంది స్మగర్లుండగా వీరిలో ఆరుగురు అంతర్జాతీయ ఎర్ర చందనం డాన్‌లు ఉన్నారు. ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగి రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఖాకీ చొక్కా కనబడితే అంతే సంగతులు. ఒక్కో గ్యాంగ్‌లో వంద మంది దాకా ప్రైవేటు సైనాన్ని నిర్వహిస్తున్నారంటే వారి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గ్రామ పొలిమేరల్లోని కోళ్లఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్ర చందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. ఇప్పటికే ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులపై పలుమార్లు దాడులు జరిగాయి.
ఇక తాజాగా పట్టుబడిన ఎర్ర చందనం దుంగలు ఏ-1 గ్రేడ్‌వని చెబుతున్నారు పోలీసులు. వీటిని జపాన్, చైనా దేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కట్టెగేనహళ్లిలో గ్రేడింగ్ చేశాక మంగళూరు సముద్ర తీరం నుంచి తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వారా తరలిస్తుంటారు. స్టీమర్లలోని ఖాళీ ప్రదేశాల్లో దుంగల నుంచి దుబాయ్‌కు తరలిస్తున్నట్లు గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడ్డ నాజర్‌ఖాన్ తెలిపాడు. ఈ స్మగ్లింగ్‌లో కొంత మంది కన్నడ పోలీసులతో పాటు, పోర్టు సిబ్బంది, సెంట్రల్, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సిబ్బంది కూడా భాగస్వామ్యులేనని గతంలో పోలీసుల విచారణలో తేలింది. అంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ అంతా తోడు దొంగలే అన్నమాట.
Youth Awardees Meet President: రాష్ట్రపతిని కలిసిన యువజన అవార్డు గ్రహీతలు..
మరోవైపు ఆలపల్లి సమీపంలోని దండుకుంట వద్ద ఎర్ర చందనం పట్టుకుంటుండగా అక్కడే ప్రధాన నిందితుడు భాస్కర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. కానీ అతన్ని పోలీసులు పట్టుకోలేదు. ఆ సమయంలో పక్కనే పొలంలో ఉన్న భాస్కర్ రెడ్డి.. తన ప్రియురాలితో కలిసి కారులో పరారైనట్లు తెలుస్తోంది. నిజానికి భాస్కర్ రెడ్డి బెంగళూరులో జేసీబీ డ్రైవర్‌గా పని చేసేవాడు. కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ డాన్‌గా ఎదిగాడు. అలాంటి వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేశారనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మారింది. ఏదేమైనా ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఈ కొత్త ‘పుష్ప’లు, కనిపించని ‘పుష్ప’లను ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి.
