Site icon NTV Telugu

గుజరాత్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌…

గుజరాత్‌ సముద్ర తీరం…డ్రగ్స్‌ రవాణాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోందా ? విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌…గుజరాత్‌ ద్వారానే దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోందా ? కచ్‌ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్‌ కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్.

గుజరాత్‌ తీరం…డ్రగ్స్‌ రవాణాకు అడ్డాగా మారిపోతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్. ఇటీవల కాలంలో వరుసగా…వందల కోట్ల విలువ చేసే…గంజాయి గుజరాత్‌ తీరం పట్టుబడింది. వారం రోజుల క్రితం 4వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను కోస్ట్‌గార్డు పట్టుకుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ మాదకద్రవ్యాలతో భారత జలల్లాలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును పట్టుకున్నారు. ఈ బోటులో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టయిన వారిలో… ఒకరు కరాచీ డ్రగ్స్‌ డాన్‌ హజి హసన్‌ కుమారుడు మహ్మద్‌ సాజిద్‌ వాఘెర్‌ గుర్తించారు.

కరాచీకి చెందిన హజీ హసన్‌… స్థానికంగా అతిపెద్ద డ్రగ్‌ డీలర్‌. అనేక దేశాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ డాన్‌గా చలామణి అవుతున్నాడు. గతంలో దుబాయిలో ఓ డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ఐదేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చాడు. తాజాగా భారత్‌కు రవాణా చేస్తున్న సరకుతో పాటు తన కొడుకు సాజిద్‌ను పంపించాడు. సాజిద్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు మత్స్యకారుల ముసుగులో 77 కిలోల హెరాయిన్‌ను ఫిషింగ్‌ బోటులో తీసుకుని కరాచీ పోర్ట్‌ నుంచి బయల్దేరారు.

అయితే కచ్ జిల్లా జాఖౌ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది గుర్తించారు. అనుమానాస్పదంగా కన్పించడంతో తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సాజిద్‌, మిగతా వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డగించి అదుపులోకి తీసుకుంది ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌.

Exit mobile version