Jangaon Missing Child Shabbir Tragedy: జనగామ జిల్లా కొడకొండ్లలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మిస్సైన ఐదేళ్ల చిన్నారి హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరుబయట ఆడుకుంటోన్న షబ్బీర్ అనే ఐదేళ్ల బాలుడు.. ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్ని గాలించారు. తమకు తెలిసిన సన్నిహితుల ఇళ్లల్లోనూ ఆరా తీశారు. ఎక్కడైనా తప్పిపోయాడేమోనని గాలించారు కూడా! కానీ, ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. తమ కొడుకు ఎక్కడున్నా, క్షేమంగా తీసుకురమ్మని తల్లిదండ్రులు పోలీసుల్ని వేడుకున్నారు.
మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత కిడ్నాప్‌గా అనుమానించారు. ఇంటి వద్దనే ఆడుకుంటున్న బాలుడు మాయం అయ్యాడంటే, కచ్ఛితంగా కిడ్నాప్ వ్యవహారమే అయ్యుంటుందని అనుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం గాలించారు. కానీ, ఇంతలోనే ఆ బాలుడు హత్యకావింపబడ్డాడు. ప్రాణాలతో తిరిగి వస్తాడనుకున్న బాలుడు విగతజీవిగా కనిపించడంతో.. అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మొదట్నుంచే ఏదైనా అఘాయిత్యం జరుగుతుందేమోనని కుటుంబ సభ్యులు ఆందోళణ వ్యక్తం చేస్తూ వచ్చారు. వాళ్లు అనుమానించినట్టుగానే బాలుడు హత్యకు గురవ్వడంతో.. శోకసంద్రంలో మునిగారు.
కాగా.. ఆ బాలుడ్ని మేనల్లుడు గుంషా అలియాస్ మహబూబ్ హత్య చేశాడు. రెండ్రోజుల క్రితం ఎవ్వరికీ అనుమానం రాకుండా బాలుడ్ని కిడ్నాప్ చేసిన అతగాడు.. షబ్బీర్‌ని హత్య చేసి, బావిలో పడేశాడు. అనంతరం పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, నల్గొండలో పట్టుకున్నారు. మరోవైపు.. ఈ కేసుని పోలీసులు లైట్ తీసుకోవడం వల్లే తమ బాలుడు ఇలా విగతజీవిగా మారాడంటూ షబ్బీర్ తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.