Jaipur Murder: రాజస్థాన్ జైపూర్‌లో సంచలనం సృష్టించిన నీరజ్ శర్మ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే తల్లిని కుట్ర ప్రకారం హత్య చేసిన కూతురు, గతంలో తండ్రి విజయ్ శర్మను కూడా హత్య చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిందితురాలు 23 ఏళ్ల ఆయుషి శర్మను అరెస్ట్ చేశారు. ఇప్పుడు విజయ్ శర్మ బావమరింది రాకేష్ శర్మ పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభమైంది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం కూతురు హత్యకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. జూలై 3న జైపూర్ ప్రతాప్ నగర్‌లో లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తున్న నీరజ శర్మను స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో మరణించింది. అయితే, రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ సంఘటన వెనక దారుణమైన కుట్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆయుషితో పాటు ఏడుగురిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బంధువు బలరామ్ అలియాస్ రవి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.
తండ్రిని కూడా చంపిందా.?
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, విజయ్ శర్మ సోదరుడు రాకేష్ శర్మ చేసిన ఫిర్యాదు మరింత సంచలనంగా మారింది. రాజస్థాన్ హైకోర్టు కోర్టు మాస్టర్‌గా పనిచేసిన విజయ్ శర్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ కోలుకుంటున్న సమయంలో ఆయుషి సరైన వైద్యం అందకుండా అడ్డుకుందని ఆరోపించారు. మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పి బంధువు బలరామ్‌తో కలిసి విజయ్ శర్మను ఇంటికి తీసుకెళ్లారని, దాదాపు మూడు నెలల పాటు ఎక్కడ ఉన్నారో కుటుంబ సభ్యులకు చెప్పలేదని పేర్కొన్నారు. జైపూర్‌లోని నివిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఇచ్చారని, అక్కడికి వెళ్లేసరికి ఆయన శరీరం 90 శాతం వరకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి తీసుకొచ్చని కొద్దిరోజులకే విజయ్ శర్మ మరణించారని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసమే దారుణం.?
తండ్రి మరణించిన వెంటనే ఆయుషి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు దరఖాస్తు చేస్తానని, కుటుంబ ఆస్తుల్ని తన పేరుపై బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చిందని రాకేష్ శర్మ ఆరోపించారు. ఒకసారి తల్లితో గొడవ జరిగిన సందర్భంగా ‘‘నాన్న ఫీడింగ్ ట్యూబ్ తొలగించి చంపగలిగితే, నిన్ను చంపడం మరింత సులభం’’ అని ఆయుషి బెదిరించినట్లు కొత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి ముందు నీరజ్ శర్మ తన వాట్సాప్ స్టేటస్‌లో ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయనే అర్థం వచ్చేలా పోస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తల్లితో ఆస్తి వివాదమే కారణమా?
తల్లి నీరజ్ శర్మపై ఆయుషి చాలా ద్వేషం పెంచుకున్నట్లు పోలీస్ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. తన దివ్యాంగ సోదరుడిపై తల్లి ఎక్కువ ప్రేమ చూపించేదని భావించి కోపం పెంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కుటుంబ ఆస్తుల వివాదం కూడా హత్యకు ప్రధాన కారణమై ఉండొచ్చని విచారణలో వెల్లడైంది. ఎల్ఎల్‌బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆయుషికి చట్టాలపై అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికతో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా విజయ్ శర్మ మరణంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు.

