Child Murder: హైదరాబాద్ మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. చిన్నారి సుమయను హత్య చేసింది ఆమె మామ, అత్తగా నిర్ధారించారు. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్ధిక లావాదేవీలు, మూఢ నమ్మకాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోల్లో ఉన్న వీరి పేర్లు.. మీర్ సమీ అలీ, యాస్మిన్ బేగం. వీరిద్దరూ చేసిన పని చూస్తే.. అసలు వీళ్లిద్దరూ మనుషులేనా అనిపిస్తుంది.
ఈ చిన్నారి పేరు హుమయేని సుమయ. కంచన్ బాగ్‌లో ఉండే షబానా, మహమ్మద్ కూతురు. ఏడేళ్ల వయసు ఉన్న సుమయను.. మేనమామ, అత్త అతి కిరాతకంగా హత్య చేశారు. ఆడుకుందాం రమ్మని పిలిచి దారుణానికి ఒడిగట్టారు. చిన్నారి నోటికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత చేతులను బెడ్ షీట్‌తో కట్టేశారు. చివరికి ఊపిరి ఆడకుండా గొంతు నులిమేశారు. అనంతరం బతికుండగానే ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్‌లో పడేశారు.
మీర్ సమీ అలీకి చిన్నారి తల్లి షబానా బేగం సొదరి అవుతుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పంపకాల్లో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. అదీ కాకుండా గతేడాది జూన్‌లో సమీ చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. ఐతే తన సోదరి చేయించిన నల్ల మంత్రాల కారణంగానే బిడ్డ మృతి చెందిందని సమీ భావించాడు. అదే సమయంలో సుమయ బాగా యాక్టివ్‌గా ఉండడం సమీ అతని భార్య తట్టుకోలేకపోయారు. దీంతో ఆ చిన్నారిని ఆడుకుందామని ఇంట్లోకి పిలిచి దారుణంగా హత్య చేశారు.
కానీ చిన్నారి సుమయ కనిపించడం లేదని తల్లిదండ్రులతో సహా అందరూ వెతికారు. వారిలో మేనమామ, అత్త కూడా ఉన్నారు. చివరికి అన్ని చోట్లా వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వెతికేందుకు 6 టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఐతే మేనమామ సమీ ఇంట్లోకి వెళ్లిన తర్వాత నుంచి చిన్నారి సుమయ బయటకు రాలేదు. దీంతో పోలీసులు వారిపైనే అనుమానం వ్యక్తం చేశారు. లోతుగా విచారణ చేయడంతో ఆర్ధిక లావాదేవీల విషయం బయటకు వచ్చింది. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకున్నారు. సుమయను తామే హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసినట్లు వెల్లడించారు.
Telangana BJP Meeting: నేడు బీజేపీ పదాధికారుల భేటీ.. టీబీజేపీ దిశానిర్దేశం
పోలీసులు వాటర్ ట్యాంక్‌లో చూసి చిన్నారి డెడ్ బాడీని బయటకు తీశారు. నోటికి ప్లాస్టర్ వేసి, చేతులు కాళ్లు కట్టేసి చాలా దారుణమైన స్థితిలో సుమయ మృతి చెంది ఉండడం కనిపించింది. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసేందుకు వారు ఉపయోగించిన బ్రౌన్ టేప్, కత్తెర, బెడ్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. చివరికి పెద్దవాళ్ల ఆర్ధిక లావాదేవీలకు చిన్నారి సుమయ బలైంది. అభం శుభం తెలియని సుమయను బలి తీసుకున్న సమీ, అతని భార్య యాస్మిన్ బేగంను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
