Site icon NTV Telugu

Hyderabad: రోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్.. వేధింపులు తాళలేక సూసైడ్..!

Rajitha Dies

Rajitha Dies

Psychologist Rajitha Suicide: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందని సామెత. అంటే ఏదైనా బాగు చేయాలని కోరుకుంటే.. మొదటికే మోసం వచ్చిందని చెబుతుంటారు పెద్దలు. సరిగ్గా ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఓ మానసిక రోగిని బాగు చేద్దామని మంచి సంకల్పంతో.. అతనితో జీవితం కూడా పంచుకుంది. కానీ చివరకు అతడి చేష్టలు.. వేధింపుల కారణంతో తానే జీవితాన్ని త్యజించాల్సిన దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో భర్త వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న ఓ సైకాలజిస్ట్ కథ.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

READ MORE: Malayalam Actress Shweta Menon: మలయాళ నటిపై కేసు నమోదు.. కంప్లెంట్‌లో షాకింగ్ నిజాలు

ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు రజిత. సైకాలజీలో పీజీ చేసింది. ఎవరి మానసిక స్థితి ఏంటో ఇట్టే పసిగడుతుంది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న వారిని బాగు చేసే ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ ఆమె తలరాత బాగాలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో నివాసం ఉండే సబ్ ఇన్స్‌పెక్టర్ నర్సింహగౌడ్ కుమార్తె రజిత. సైకాలజీ చదువు పూర్తి కాగానే ఆమె బంజారాహిల్స్‌లోని ఓ మానసిక ఆస్పత్రిలో ఉద్యోగానికి చేరింది. అక్కడే ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసింది. ఈ క్రమంలో అక్కడ మానసిక వ్యాధికి చికిత్స పొందుతున్న ఆగు రోహిత్ పరిచయమయ్యాడు. KPHBకి చెందిన రోహిత్.. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశాడు. ఐతే రజితను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు రోహిత్. ఈ క్రమంలో రోహిత్ ప్రేమను అంగీకరించింది రజిత. అతన్ని మానసిక రుగ్మత నుంచి బయటపడేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులతో తెలిపి వారి అంగీకారంతో రోహిత్‌ను పెళ్లి చేసుకుంది..

READ MORE: Off The Record: పార్టీ ఏదైనాసరే.. ఆ బ్రదర్స్‌కు కేసులు కామనా..?

పెళ్లి తర్వాత రోహిత్ మారతాడని.. మానసిక రుగ్మత నుంచి బయటపడతాడని భావించింది. కానీ రజిత కలలు.. ఆశలు అడియాశలయ్యాయి. ఆమె.. తన జీవితంలో ఆశించింది ఒకటైతే.. దానికి భిన్నంగా జరిగింది మరొకటి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్.. రిలాక్సయ్యాడు. పనీ పాట లేకుండా ఖాళీగా తిరగడం మొదలు పెట్టాడు. పైగా రజితనే వేధించడం షురూ చేశాడు. ఆమె డబ్బులతో జల్సాలు చేశాడు రోహిత్. చెడు అలవాట్లు మానుకోవాలని అనేకసార్లు చెప్పినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక రోహిత్ తల్లిదండ్రులు కిష్టయ్య, సరేషతోపాటు సోదరుడు మోహిత్ కూడా అతనికే సహకరించారు. వారు కూడా రజితను వేధించారు.. రోజూ పడుతున్న నరకయాతనను తట్టుకోలేకపోయింది రజిత. ఈ క్రమంలో చేసేదేం లేక.. సైకాలజిస్ట్ అయి ఉండి కూడా తాను కూడా మనోస్థైర్యం కోల్పోయింది. జులై 16న ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ కుటుంబ సభ్యులు చూసి ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. కానీ ఆమె సమస్యలు మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో మరింత కుంగిపోయిన రజిత.. జులై 28న మరోసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బాత్‌రూమ్ కిటికీ నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను మళ్లీ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రంగా దెబ్బ తగలడంతో బ్రెయిన్ డెడ్ అయింది. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచింది.. రజిత మృతిపై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రోహిత్‌ను ఆతని కుటుంబ సభ్యులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. మొత్తంగా.. ఓ మానసిక రోగి జీవితాన్ని చక్కదిద్దాలని సంకల్పించిన రజిత జీవితం అర్ధాంతరంగానే ముగిసిపోయింది..

Exit mobile version