NTV Telugu Site icon

Job Fraud: ఘరానా మోసం.. యూరప్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..

Job Fraud Hyderabad

Job Fraud Hyderabad

Hyderabad Man Cheated Youngsters In The Name Of Job: విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఎవరికీ ఉండదు చెప్పండి..? అక్కడ డాలర్లలో సంపాదించి, ఇక్కడ నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని అందరూ భావిస్తుంటారు. చిన్న ఉద్యోగాలు దొరికినా సరే, విదేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటారు. దీన్నే అలుసుగా తీసుకొని.. ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. యూరప్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. 150 మందికి పైగా హైదరాబాదీ యువకుల్ని మోసం చేశాడు. ఆ యువకుల వద్ద నుంచి ఏకంగా రెండున్నర కోట్లు కాజేశాడు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన ఆ నిరుద్యోగులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Jalumuri Srinivas: పోలీసుల అదుపులో మావోయిస్ట్ జలుమూరి శ్రీనివాస్

మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి ఫ్యాబ్రల్ ఓవర్సీస్ పేరుతో యూరోపియన్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఇది చూసిన కొందరు నిరుద్యోగ యువకులు బషీర్‌ని సంప్రదించారు. యూరప్‌లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని, జీతం అద్భుతంగా వస్తుందని, ఆ జీతంతో ఎంతో విలాసవంతంగా జీవించవచ్చని వారికి ఎర వేశాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. ఇలా 150 మంది యువకుల నుంచి రెండున్నర కోట్లు తీసుకున్నాడు. వాళ్లందరికీ ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి.. త్వరలోనే మీకు కాల్స్ వస్తాయని నమ్మించాడు. అయితే.. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు. చివరికి అతడిచ్చిన ఆఫర్ లెట్స్ ఫేక్ అని తేలడంతో.. తాము మోసపోయామని యువకులు గ్రహించారు. ఇంతలోనే బషీర్ ఆఫీస్ బోర్డు తిప్పేశాడు.

Mark Zuckerberg: జుకర్‌బర్గ్‌కు భారీ స్థాయిలో భద్రత పెంపు..అందుకేనా!

దీంతో.. చేసేదేమీ లేక బాధితులు పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు. యూరప్‌లో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి.. బషీర్ తమను మోసం చేశాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో.. పంజాగుట్ట పోలీసులు ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. సెంట్రల్ క్రైమ్ పోలీసులు 406, 420, 465, 468, 471 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.