Cyber Crime : సైబర్ నేరగాళ్ల కొత్త తరహా బ్లాక్‌మెయిల్ ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ LIC ఉద్యోగిని టార్గెట్ చేసి, నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. పోర్న్ వీడియోల కేసులో ఇరుక్కున్నావంటూ భయపెట్టి, బ్యాంక్ వివరాలతో పాటు, భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులమని చెప్పి వీడియో కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం ఈ కేసులో మరింత ఆందోళన కలిగించే విషయం.
సంఘటన వివరాల్లోకి వెళ్తే, సదరు LIC ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను “క్రైమ్ బ్రాంచ్” పోలీసునని పరిచయం చేసుకున్నాడు. ఆ ఉద్యోగి వాట్సాప్ నెంబర్ ద్వారా “అశ్లీల వీడియోలు” షేర్ అయ్యాయని, దీనిపై తీవ్రమైన కేసు నమోదైందని బెదిరించాడు. ఈ కేసులో వెంటనే జైలుకు వెళ్లే అవకాశముందని, అరెస్ట్ కాకుండా ఉండాలంటే వెంటనే బ్యాంక్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.
Tadipatri: తాడిపత్రిలో మరోమారు టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసు బందోబస్తు!
సైబర్ నేరగాళ్లు తమ బెదిరింపులను మరింత నమ్మశక్యంగా మార్చేందుకు వీడియో కాల్స్ కూడా ఉపయోగించుకున్నారు. పోలీసుల యూనిఫాంలో ఉన్నట్లు నటిస్తూ, ఆ LIC ఉద్యోగికి వీడియో కాల్ చేసి, “పోలీసులమ”ని నమ్మించారు. “మీరు సహకరించకపోతే, ఈ మధ్యాహ్నం లోగా అరెస్ట్ చేసి తీసుకెళ్తాం,” అంటూ తీవ్రంగా బెదిరించారు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఒత్తిడికి, భయానికి గురయ్యాడు.
సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యం ఆ ఉద్యోగి బ్యాంక్ వివరాలు, మరియు డబ్బు. ఏదో ఒక సాకుతో, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భయపడి, చాలా మంది ఇలాంటి బెదిరింపులకు లొంగిపోతారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. అందుకే, సామాన్య ప్రజలను ఇలాంటి పద్ధతుల్లో టార్గెట్ చేస్తున్నారు.
గత నాలుగు రోజులుగా ఈ వేధింపులతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న LIC ఉద్యోగి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఉదంతం ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఇటువంటి బెదిరింపులకు ఎవరూ లొంగకూడదని, వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సైబర్ క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా సరే ఫోన్ ద్వారా డబ్బు లేదా బ్యాంక్ వివరాలు అడిగితే, అది కచ్చితంగా మోసమేనని గ్రహించాలని వారు హెచ్చరిస్తున్నారు.
