హయత్‌నగర్‌లో మగవాళ్లను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ పేరుతో దగ్గర కావడం, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రహస్యంగా రికార్డ్ చేయడం, తరువాత ఆ వీడియోలను చూపించి డబ్బులు దోచుకోవడం.. ఇలాంటి నేర పద్ధతితో ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ప్రాంతానికి చెందిన ఈ మహిళ రెండవ వివాహం ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో జరిగినట్లు సమాచారం.
అతడితో పాటు ఆమె వ్యక్తిగత పనుల కోసం వచ్చే కారు డ్రైవర్‌ను కూడా ఇదే విధంగా మభ్యపెట్టి లక్షల రూపాయలు కాజేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఈమె ట్రాప్‌లో పడినట్లు తెలుస్తోంది. వారితో గడిపే సమయంలో రహస్యంగా తీసిన వీడియోలను చూపిస్తూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మహిళ నడిపిన ఎక్స్‌టర్షన్ మోసాల గుట్టు రట్టు చేయడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరికొంతమంది బాధితులు ఉండే అవకాశాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు.
