పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’ సినిమాలో ఒక సీన్ గుర్తుందా..? ప్రకాష్ రాజ్ మారువేషంలో వెళ్లి మందు అమ్ముతున్న దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. సరిగ్గా అదే తరహాలో.. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి వేళ ఒంటరి మహిళగా రోడ్డుపై నిలబడి పోకిరీల ఆటకట్టించారు. ఏసీ గదుల్లో కూర్చుని నివేదికలు చదవడం కంటే.. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె చేసిన ఈ సాహసం అభినందనీయం. పోకిరీల ఆగడాలను అరికట్టాలంటే ఇలాంటి వినూత్న ప్రయోగాలు ఎంతో అవసరం. పోలీసులంటే భయం లేని వారికి ఇదొక గట్టి హెచ్చరిక.
హైదరాబాద్ నగరంలో మహిళల రక్షణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి మల్కాజిగిరి సీపీ సుమతి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పోలీస్ భద్రత లేకుండా.. సామాన్య మహిళలా వేషం మార్చుకుని అర్ధరాత్రి 12:30 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు బస్టాప్ వద్ద ఒంటరిగా వేచి చూశారు.
కేవలం మూడు గంటల వ్యవధిలో దాదాపు 40 మంది పురుషులు ఆమెను సమీపించారు. వీరిలో ఎక్కువమంది మద్యం మత్తులో ఉండగా, మరికొందరు గంజాయి సేవించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ఒంటరిగా ఉన్న మహిళను చూసి వస్తావా..? రేటు ఎంత అంటూ అసభ్యంగా ప్రవర్తించడం నగరంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించింది. ఎదురుగా ఉన్నది ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అని తెలియక వారు చేసిన ఆగడాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి.
ఈ ఆపరేషన్ తర్వాత పోలీసులు సదరు వ్యక్తులను గుర్తించారు. అయితే వెంటనే కేసులు నమోదు చేయకుండా, వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి, బహిరంగ ప్రదేశాల్లో మర్యాదగా ఎలా ఉండాలి అనే విషయాలపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సుమతి ఇలాంటి ప్రయోగాలు కొత్తేమీ కాదు. 25 ఏళ్ల క్రితం కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో డీఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఆమె ఇలాగే మారువేషంలో వెళ్లి మహిళల రక్షణను పర్యవేక్షించారు. గతంలో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్‌గా పనిచేసిన ఆమె, మావోయిస్టుల లొంగుబాటులో కూడా కీలక పాత్ర పోషించారు. సీపీ సుమతి ఈ తెగువను చూసి నగరవాసులు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులే స్వయంగా రంగంలోకి దిగితేనే క్షేత్రస్థాయి సమస్యలు తెలుస్తాయని ఈ ఘటన నిరూపించింది.
