Site icon NTV Telugu

Hyderabad Child Kidnap: మీ పిల్లలు జాగ్రత్త..!

Child Kidnap

Child Kidnap

Hyderabad Child Kidnap: పిల్లల విషయంలో ఏమరపాటు వద్దు. కన్ను మరల్చామా అంతే.. గద్దలు తన్నుకు పోయినట్లు పిల్లలను ఎగేసుకుని పోతారు. పిల్లలు లేని దంపతులు సంప్రదిస్తే వారికి అమ్మేసుకుంటారు. అలా.. పిల్లలను దొంగిలించి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ 4 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు పిల్లలను ఎత్తుకు వెళ్తున్న ముఠా గురించి విషయాలు తెలిశాయి…

READ ALSO: Durvas Patil : రత్నగిరి దారుణం.. ప్రేమికురాలి మృతదేహం లోయలో!

హైదరాబాద్‌లోని పోచమ్మ టెంపుల్ వద్ద ఆగస్టు 26న అఖిల్ అనే 4 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. అ బాలుని తల్లి.. మరో కొడుకును ఆస్పత్రికి తీసుకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. వచ్చి చూసే సరికి అఖిల్ అదృశ్యమయ్యాడు. చుట్టు పక్కల అంతా వెతికింది. కానీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..బాలుని జాడ కనిపెట్టేందుకు టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు..

ఈ కేసులో ప్రధాన నిందితునిగా చిలుకూరి రాజును గుర్తించారు. అతను ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహరెడ్డి సహకరిస్తున్నారు. వీరందరూ ఓ ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేసి.. పిల్లలు లేని తల్లిదండ్రులకు వారిని అమ్ముకుంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో రెక్కీ చేస్తారు. ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తిస్తారు. మఖ్యంగా సంచార జాతుల వారి పిల్లలను కిడ్నాప్ చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్నారు. వారు ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా పట్టించుకోరనేది ముఠా సభ్యుల అభిప్రాయం. అలా మొత్తంగా ఇప్పటి వరకు గత ఐదేళ్లలో ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసి.. అమ్మేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది..

ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న రిజ్వానా కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఆమెను కస్టడీలోకి తీసుకుంటే ఎంత మంది పిల్లలను అమ్మేశారనే విషయం బయటపడుతుందని చెబుతున్నారు. ఇక ఈ ముఠాతోపాటు బాల్ రాజు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్ రాజు తన ఇద్దరు పిల్లలను ఈ ముఠాకు అమ్మినట్లు గుర్తించారు. మొత్తంగా నలుగురు పిల్లలను రెస్క్యూ చేసి పేరెంట్స్ కు అప్పగించారు. ఇక వీరి దగ్గర నుంచి పిల్లలను కొన్న పేరెంట్స్ పైనా కేసులు పెడుతున్నారు పోలీసులు.. మరోవైపు తన కొడుకు తనకు దొరుకుతాడనుకోలేదని అఖిల్ తల్లి చెబుతోంది. తన కొడుకును వెతికి తీసుకు వచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. పిల్లలను అమ్ముతున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.. ఎంత పనిలో ఉన్నా చిన్న పిల్లలపై ఎప్పుడూ ఓ కన్ను వేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఇలాంటి ముఠాల బారిన పిల్లలు పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు..

READ ALSO: President Murmu: ‘‘మీకు కన్నడ తెలుసా..?’’ అని ప్రశ్నించిన సిద్ధరామయ్య.. రాష్ట్రపతి ముర్ము సమాధానం ఇదే..

Exit mobile version