Husband Stabbed Wife To Death In Karnataka Family Court After Councelling: భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. కొందరు వాటిని అప్పటికప్పుడే పరిష్కరించుకుంటే.. మరికొందరు మాత్రం ‘ఇగో’కి పోయి ఆ గొడవల్ని మరింత పెద్దగా చేసుకుంటారు. అప్పుడది అనూహ్య పరిణామాలకి దారి తీస్తుంది. అలాంటిదే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల పాటు సంసార జీవితాన్ని సాఫీగానే సాగించిన ఓ జంట.. కొంతకాలం నుంచి విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. విడాకుల కోసం కోర్టుమెట్లెక్కిన ఆ జోడీ.. కౌన్సిలింగ్‌లో భాగంగా కలిసి ఉందామని అనుకున్నారు. కానీ, ఇంతలోనే భర్త కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసేశాడు. కర్ణాటకలోని హాసన్ జిల్లా హలెనరసిపుర ఫ్యామిలీ కోర్టు ఆవరణలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హసన్ జిల్లాకు చెందిన శివకుమార్‌కు ఏడేళ్ల క్రితం చైత్ర అనే మహిళతో వివాహమైంది. ఏడేళ్ల వరకూ వీళ్ల దాంపత్య జీవితం సజావుగానే సాగింది. అయితే.. కొంతకాలం క్రితం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో దూరంగా ఉంటున్నారు. చివరికి తమ మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు సమసిపోవని గ్రహించి.. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో కోర్టు అధికారులు వారిని పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. విభేదాల్ని పరిష్కరించుకొని, కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించమని సూచించారు. మొదట్లో అంగీకారం తెలపలేదు కానీ.. ఫైనల్‌గా ఇద్దరు కలిసి ఉంటామని అధికారులకు చెప్పారు. దీంతో.. కాసేపు మాట్లాడుకోవడం కోసం ఆ ఇద్దరిని ఏకాంతంగా వదిలేశారు. కౌన్సిలింగ్ గది నుంచి బయటకు వచ్చాక.. ఆవరణలో నిలబడి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం చైత్ర అక్కడి నుంచి బాత్రూం కోసమని వెళ్లింది.
అప్పుడే శివకుమార్ ఆమెపై ఒక్కసారిగా ఎగబడ్డాడు. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తి తీసుకొని, చైత్ర గొంతు కోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు శివకుమార్‌ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అటు.. రక్తపు మడుగులో ఉన్న చైత్రను ఆసుపత్రికి తరలించగా, ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అదుపులోకి తీసుకున్న శివకుమార్‌ని.. ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? కౌన్సిలింగ్ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన సంబాషణలేంటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అసలు కోర్టు ఆవరణలోకి శివకుమార్ కత్తిని ఎలా తీసుకొచ్చాడన్నది కూడా మిస్టరీగా మారింది.