Cigarette Fire: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని దానిపైనే రాసి ఉంటుంది.. అయినా.. కొందరు దానికి బానిసగా మారిపోతారు.. కొందరు సిగరెట్లు, మరికొందరు బీడీలు.. ఇంకా కొందరు చుట్టలు ఇలా.. లాగిస్తుంటారు.. వీటితో అనారోగ్య సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచినవాళ్లు ఎందరో ఉంటారు.. కానీ, ధూమపానానికి బానిసైన ఓవృద్ధుడు చివరకు తను కాలుస్తున్న సిగరెట్ మంచానికి అంటుకొని అగ్నిప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
Read Also: BCCI: బీసీసీఐ కఠిన ఆంక్షలు.. ఇక నుంచి వారం రోజులు మాత్రమే!
పూర్తి వివరాల్లోకి వెళ్తే గుడవాడలోని ద్రోణాదులవారి వీధికి చెందిన చల్లా వెంకటేశ్వరరావు(71) కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యారు. ధూమపానం అలవాటుతో సిగరెట్ వెలిగించి నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయంలో ఆయన భార్య అల్పాహారం కోసం బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సిగరెట్ పీకకు ఉన్న నిప్పు ప్లాస్టిక్ నవ్వారు మంచానికి అంటుకొని అగ్ని ప్రమాదానికి గురయ్యారు. కొద్ది సేపటికి అల్పాహారం తీసుకొని భార్య ఇంటికొచ్చి చూసేసరికి అప్పటికే మంటల్లో చిక్కుకున్న భర్తను ఇరుగు పొరుగువారి సాయంతో రక్షించి.. 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటికే వెంకటేశ్వరరావు మరణించారు. సిగరెట్ అలవాటు వల్ల లేవలేని స్థితిలో ఈ ప్రమాదం బారిన పడి వెంకటేశ్వరరావు మృతి చెందడంతో స్థానికంగా. విషాదం నెలకొంది.