Site icon NTV Telugu

Rachakonda : దొంగతనం కేసులో పోలీసుల చేతివాటం

Police

Police

దొంగను పట్టుకున్న పోలీసే దొంగ అయితే ఎలా వుంటుంది. హాస్యాస్పదంగా వుంటుంది కదూ.. ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుందటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే.. చోరీ కేసులో పట్టు పడ్డ ఖాతాలో నుంచి ఓ.. పోలీసు బాసు డబ్బులు కాజేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చోరీ కేసులో ఓ పోలీసు ఇన్స్పెక్టర్ చేతివాటం చూపించాడు. ఏకంగా అరెస్టై జైలులో ఉన్న నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడు ప్రబుద్ధుడు. ఆ.. విషయం కాస్తా బయటకు రావడంతో.. ఇన్స్పెక్టర్ వ్యవహారంపై రాచకొండ పోలీస్ కమిషనర్ అంతర్గత విచారణ ప్రారంభించారు. నిందితుడు జైలులో ఉన్నప్పుడు డబ్బు విత్ డ్రా చేయడం పోలీసులపై పలు విమర్శలకు దారితీస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అగర్వాల్ అనే వ్యక్తిని చోరీ కేసులో రాచకొండ కమీషనరేట్ కి చెందిన CCS పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ.. సమయంలో అగర్వాల్ దగ్గర నుంచి డెబిట్ కార్డును కూడా సీజ్ చేశారు పోలీసులు. అయితే.. కొద్దిరోజులు క్రితమే నిందితుడి బెయిల్ పై బయటకు వచ్చాడు. డెబిట్ కార్డునుంచి డబ్బులు విత్రా కావడంతో నిర్ఘాంతపోయాడు. ఏకంగా అగర్వాల్ ఖాతా నుంచి 5లక్షలు మాయం కావడంపై బ్యాంకులో ఆరాతీశాడు. ఏఏ ATM ల నుండి డబ్బులు డ్రా చేశారనే వివరాలను సేకరించాడు. సీజ్ చేసిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు ఎలా మాయమయ్యాయో అంటూ ఆలోచనలో పడ్డాడు అగర్వాల్. ఇక చేసేదేమి లేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. ఒక ఇన్స్పెక్టర్.. నిందితుడి ఏటీఎం కార్డ్ ద్వారా 5 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించారు పోలీసులు. అతనిపై విచారణ కొనసాగుతోందని.. చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

నేరం చేశాడంటూ అగర్వాల్ ను అదుపులో తీసుకున్న పోలీసులు, అతని డెబిట్ కార్డు సీజ్ చేయడమే కాకుండా అతని ఖాతానుంచే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు లక్షలు మాయం చేయడం పై సర్వత్రా సంచలనంగా మారింది.ఆ పోలీసు తీరుపై తెలంగాణ పోలీసు వ్యవస్థమీద ప్రజలకు నమ్మకం పోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నిందితుడిని పట్టుకున్న పోలీసు బాసే అతని ఖాతా నుంచే డబ్బులు డ్రా చేయడం, పోలీస్ సారు కూడా నిందితుడిలా మారడం విడ్డూరంగా వుందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. మరి ఈ..భక్షకుడిలా మారిన ఈ ర‌క్ష‌క‌ భటునిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Covid Vaccine: గుడ్ న్యూస్.. నోటి మాత్రల రూపంలో కరోనా వ్యాక్సిన్

Exit mobile version