Site icon NTV Telugu

Murder : మద్యానికి బానిసైన కొడుకు దారుణం.. తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదం

Murder

Murder

కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. కానీ ఆ కొడుకు.. ఆస్తి కోసం తండ్రిని దారుణంగా చంపేశాడు. సుత్తితో బలంగా మోది చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వృద్ధాప్యంలో తండ్రికి అండగా నిలవాల్సిన కొడుకే ఆ కన్న తండ్రి పట్ల కాలయముడయ్యాడు… ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో జరిగింది.

గొట్లపల్లికి చెందిన హన్మంతు, నర్సమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అంతా వేర్వేరుగా కాపురం పెట్టారు. వీరిలో మూడో కొడుకు రవి భార్య చనిపోయింది. అతనికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గతంలో మేస్త్రీ పని చేసిన రవి.. ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని పిల్లల బాధ్యతను కూడా తల్లి నర్సమ్మే నెరవేరుస్తోంది. మద్యం తాగుతూ రోజూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు రవి.

ఈ క్రమంలో తల్లి నర్సమ్మపై మద్యం మత్తులో చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె చేయి విరిగిపోయింది. నర్సమ్మ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత… పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోని మంచంపై ఉన్న తండ్రితో గొడవ పెట్టుకున్నాడు రవి. తండ్రి ఆస్తిలో తన వాటాకు రావాల్సిన భూమి తన పేరిట పట్టా చేయాలని వేధించాడు. కానీ అందుకు తండ్రి ససేమిరా అన్నాడు. ఐతే ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ.. తల్లిదండ్రులు నిరాకరిస్తూనే ఉన్నారు. మద్యం అలవాటు వల్ల భూమి ఎవరికైనా అమ్మేస్తే.. పిల్లలు ఆగమవుతారనేది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం. ఇదే కారణంతో రవి పేరిట పట్టా చేసేందుకు ససేమిరా అంటున్నారు.

కానీ ఇదే విషయంలో తల్లిదండ్రులపై కోపంగా ఉన్న రవి.. తండ్రిపై దాడి చేశాడు. సుత్తితో తలపై బాదాడు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత 100 నంబర్ కు డయల్ చేసిన రవి.. తన తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని చంపేందుకు ఉపయోగించిన సుత్తిను స్వాధీనం చేసుకున్నారు..

Exit mobile version