కాదేదీ క్రైమ్‌కు అనర్హం.. అనేలా ఉంది పరిస్థితి. ఊరు లేదు.. పేరు లేదు.. ఇంకా చెప్పాలంటే అసలు దేశమే లేదు. కానీ అలాంటి దేశంలో జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి ఒకడు దుకాణం తెరిచాడు. తన వలలో పడ్డ వారి దగ్గర అందినకాడికి దోచుకుంటున్నాడు. ఆ నోటా ఈ నోటా పోలీసులకు విషయం తెలియడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు? గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సొంతంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాడు కదా. ఈ వ్యక్తి కూడా సొంతంగా ఓ దుకాణం తెరిచాడు. కాకపోతే అది అలాంటి ఇలాంటి దుకాణం కాదు. ఏకంగా ఎంబసీనే పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి.. ఆ ఎంబసీ ఇదే…
ఘజియాబాద్‌లో ఓ మంచి బిల్డింగ్ అద్దెకు తీసుకున్నాడు. అందులో వెస్ట్ ఆర్కిటికా పేరుతో ఎంబసీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎంబసీ ముందు ఖరీదైన కార్లు పార్క్ చేయించి ఉంచాడు. పైగా ఆయా కార్లపై ఎంబసీ స్టిక్కర్లు కూడా అంటించాడు. ఎవరికీ అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అంతా బాగానే చేశాడు కానీ.. ఎంబసీ పేరుతో తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. వాటిని చూసి పోలీసులకు అనుమానం రావడంతో కూపీ లాగితే మొత్తం విషయం బయటకు వచ్చింది..
Fighter jets: మనకు కావాలి “5th జనరేషన్ ఫైటర్ జెట్స్”.. విదేశాల నుంచి కొనుగోలుకు యత్నం..
ప్రధాని, రాష్ట్రపతి వంటి వాళ్లతో కూడిన మార్ఫింగ్ ఫోటోలు చూపించి మోసం చేస్తున్నాడు హర్షవర్దన్ జైన్. ఊరు పేరు లేని దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులన నట్టేట ముంచుతున్నాడు. ఐతే ఘజియాబాద్‌లోని వెస్ట్ ఆర్కిటికా నకిలీ రాయబార కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. ఒక్క వెస్ట్ ఆర్కిటికా మాత్రమే కాదు.. అలాంటి పలు గుర్తింపులేని దేశాల రాయబారిగా చెప్పుకుంటున్న హర్ష వర్ధన్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు ఖరీదైన వాహనాలు, 12 నకిలీ పాస్‌పోర్టులు, విదేశాంగ శాఖ ముద్రతో ఉన్న నకిలీ పత్రాలు, రెండు పాన్‌కార్డులు, 34 రబ్బర్ స్టాంపులు సహా రెండు నకిలీ ప్రెస్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు రూ. 44.70 లక్షల క్యాష్, 18 దౌత్యపరమైన నంబరు ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు…
ఇక విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం సహా షెల్ కంపెనీల ద్వారా.. హర్షవర్ధన్ జైన్.. హవాలా లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. 2011లో అక్రమంగా శాటిలైట్ ఫోన్‌ను వినియోగించిన కేసు కూడా అతడిపై ఉందంటున్నారు పోలీసులు. విదేశాల్లో పని ఇప్పిస్తానని యువతను నమ్మిస్తూ ఓ జాబ్ రాకెట్ నడుపుతున్నాడు హర్షవర్దన్ జైన్. అలాగే మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు అభియోగాలు మోపారు. యువత అతడిని నమ్మేందుకు పలు జిమ్మిక్కులు ఉపయోగించాడు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను వాడుకున్నాడు…
నిజానికి వెస్ట్‌ఆర్కిటికా అనేది అంటార్కిటికాలోని ఒక ప్రాంతం. ఒక యూఎస్ నౌకాదళ అధికారి తన దేశంగా ప్రకటించుకున్నాడు. కానీ దీనికి ఎలాంటి గుర్తింపు లేదు. దీని పేరుతో జైన్ ఎంబసీ కార్యాలయం ఏర్పాటు చేసి చీటింగ్ మొదలు పెట్టాడు. అంతే కాదు వెస్ట్‌ఆర్కిటికా ఎంబసీ పేరిట ఏర్పాటు చేసిన ఇన్‌స్టాగ్రాంలో తనను తాను ఆ దేశానికి చెందిన సంపన్నుడిగా పేర్కొన్నాడు. 2017 నుంచి దౌత్యకార్యాలయం కార్యకలాపాలు నడుస్తున్నట్లు వెల్లడించాడు.
Peddapuram: పెద్దాపురంలో మళ్లీ వ్యభిచార దందా.. పోలీసులే సహకరిస్తున్నారా..?
