విదేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు వల వేసి లక్షల రూపాయలు కాజేస్తున్న ఘరానా మోసాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు రట్టు చేశారు. మలేషియాలో డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి విదేశాల్లో నరకం చూపించిన ‘బెల్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ కన్సల్టెన్సీకి చెందిన నిందితులు బల్లె నరేష్, జగవీర పిల్లెలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిందితుడు బల్లె నరేష్, బాధితుడైన బాలగంగాధర రావుకు పరిచయమయ్యాడు.
మలేషియాలో నెలకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగం ఉందని నమ్మించి, కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలోని మంజీర ట్రినిటీ భవనంలో ఉన్న తమ కార్యాలయానికి పిలిపించుకున్నారు. అక్కడ కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకుని, విడతల వారీగా రూ.2.42 లక్షలు వసూలు చేశారు. అనంతరం బాధితుడిని మలేషియా పంపించిన నిర్వాహకులు, అక్కడ అతడిని ఎవరూ రిసీవ్ చేసుకోకుండా గాలికొదిలేశారు.
అక్కడి స్థానిక ఏజెంట్లు అతడి వద్ద నుంచి పాస్‌పోర్ట్ లాక్కుని, సింగపూర్ వెళ్లాలని బెదిరించడమే కాకుండా, స్వదేశానికి తిరిగి రావాలంటే మరో రూ.3 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. విదేశంలో నరకం చూసిన బాధితుడు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సంస్థను ఆశ్రయించి, వారి చొరవతో సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాడు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బాధితుడు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
విచారణ చేపట్టిన పోలీసులు, ఇదే కన్సల్టెన్సీ మరొకరి వద్ద నుంచి కూడా రూ.1.80 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ విదేశీ ఉద్యోగ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

