సమయస్ఫూర్తి, సాహసం ప్రదర్శించి ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో దొంగను ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులో బంగారం, నగదు ఉన్న బ్యాగుతో పాటు ప్రయాణికుల సెల్‌ఫోన్లు చోరీ చేసి పరారవుతున్న నిందితుడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ డి. మల్కయ్య సంగారెడ్డి నుంచి నగరానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అంతకుముందు సంగారెడ్డి బస్టాండ్‌లో ఓ బ్యాగును, బస్సు ప్రయాణంలో కొందరి సెల్‌ఫోన్లను కొట్టేసిన ఓ వ్యక్తి, కంది స్టేజీ రాగానే హడావుడిగా కిందకు దిగాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బస్సు కండక్టర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
అది గమనించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మల్కయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బస్సు దిగి ఆ అనుమానితుడి వైపు వెళ్లారు. కానిస్టేబుల్‌ను చూసి ఆ వ్యక్తి పరుగు లంకించుకోగా, కండక్టర్ అనుమానం నిజమేనని గ్రహించిన మల్కయ్య సుమారు అర కిలోమీటరు మేర ఛేజ్ చేసి చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు.
నిందితుడిని రాజమండ్రి ప్రాంతానికి చెందిన బి. వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బ్యాగుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదే బస్సులో నిందితుడిని తరలించి పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కానిస్టేబుల్ మల్కయ్యతో పాటు బస్సు డ్రైవర్, కండక్టర్ నిందితుడిని, రికవరీ చేసిన సొత్తును పోలీసులకు అందజేశారు. ఆ బ్యాగులో నగదు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
విధి నిర్వహణకు వెళ్తూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి, ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకున్న కానిస్టేబుల్ మల్కయ్య సాహసాన్ని బస్సులోని తోటి ప్రయాణికులు ముక్తకంఠంతో ప్రశంసించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ కానిస్టేబుల్ మల్కయ్యను ప్రత్యేకంగా అభినందించారు.

