నిజామాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి దోపిడీకి పాల్పడ్డారు. వినాయకనగర్‌లో నివసించే వృద్ధ దంపతులను టార్గెట్ చేసి, “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి ఏకంగా రూ.40 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వృద్ధుడికి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. తాము ముంబయి పోలీసులు అని పరిచయం చేసుకున్న నిందితులు నకిలీ ఐడీ కార్డులు చూపించారు. మీ బ్యాంకు ఖాతా మనీలాండరింగ్ కేసులో ఇరుక్కుపోయిందని, ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారని భయపెట్టారు. అంతేకాకుండా, సీబీఐ, ట్రాయ్, ఆర్బీఐ పేర్లతో నకిలీ నోటీసులు పంపి మరింతగా బెంబేలెత్తించారు. ఈ భయంతో బాధితులు వీడియోకాల్‌ను కట్ చేయకుండా ఏకంగా 50 గంటలపాటు ఇంట్లోనే నిర్బంధితులుగా ఉన్నారు.
తరువాత నిందితులు రూ.30 లక్షలు డిమాండ్ చేస్తే, భయంతో వృద్ధులు ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేశారు. ఇంతటితో ఆగకుండా, బాధితుడి బ్యాంక్ లాకర్‌లో బంగారం ఉన్న విషయం తెలిసిన సైబర్ నేరగాళ్లు, దానిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు పంపాలని ఒత్తిడి చేశారు. ఈ సమయంలో వృద్ధుడు తన స్నేహితుడికి ఫోన్ చేయగా, ఆయన జరుగుతున్న మోసాన్ని గుర్తించి వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని మొత్తం 30 లక్షల్లో 20 లక్షలు స్తంభింపజేశారు. అయితే అప్పటికే నిందితులు 10 లక్షలను విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, వీడియోకాల్‌లు, నకిలీ నోటీసులను నమ్మొద్దని సూచించారు. అదేవిధంగా అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కి ఫిర్యాదు చేయాలని హెచ్చరించారు.
