Site icon NTV Telugu

Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

Rajahmundry

Rajahmundry

మద్యం మత్తులో స్టీరింగ్ పట్టిన నలుగురు యువకులు ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టారు. రాజమండ్రిలో అర్ధరాత్రి రోడ్లపై రేసింగ్ చేస్తూ పలుచోట్ల ప్రమాదాలు చేశారు పోకిరీ యువకులు. చివరికి వారి నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో షికారు చేస్తూ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కారులో నలుగురు యువకులు.. పీకలదాకా మద్యం తాగారు.. అర్ధరాత్రి షికారుకు బయల్దేరారు. అసలే మద్యం మత్తు..పైగా హైస్పీడ్‌తో రోడ్డుపై బీభత్సం సృష్టించారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పలు ప్రమాదాలు చేశారు కారులోని యువకులు.

రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో… ధవళేశ్వరానికి చెందిన వాసు అనే 45 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

కేసులో నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అంతకు ముందే ఓ తోపుడు బండిని కూడా ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

రోడ్డుపై పోకిరీలు చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version