Woman Robs Own Home: ఢిల్లీకి చెందిన ఓ మహిళ సొంతింటికే కన్నం పెట్టింది. బురఖా ధరించి సొంత ఇంటిలో పెళ్లి కోసం ఉంచిన నగలను దోచింది. 31 ఏళ్ల యువతి ఇంట్లోకి చొరబడి నగలు, నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 30న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని సేవర్ పార్క్‌లోని ఇంట్లో జరిగింది. దీనిపై ఇంటి యజమాని కమలేష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
Read Also: Kerala: ఆకలి బాధ.. పిల్లి పచ్చి మాంసం తిన్న వ్యక్తి..
కమలేష్ పెద్ద కుమార్తె శ్వేత ఈ దోపిడికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తేలింది. జనవరి 30న మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య తన ఇంట్లో నుంచి లక్షా 25వేల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసింది. దోపిడికి సంబంధించిన వివరాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. అయితే, మహిళ దర్జాగా, ఇళ్లు బాగా తెలిసిన వ్యక్తిగా ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు.
తన తల్లి, తన చెల్లిని ఎక్కువగా ప్రేమిస్తుండటం వల్లే ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు శ్వేత విచారణలో ఒప్పుకుంది. అసూయ, ద్వేషం వల్ల ఈ పనిచేసినట్లు వెల్లడించింది. తనకు ఉన్న అప్పులను కూడా తీర్చాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలిపింది. దొంగిలించిన వాటిలో కొన్ని శ్వేత ఆభరణాలు కాగా.. మరికొన్ని ఆమె చెల్లిలు పెళ్లికి చేయించిన ఆభరణాలు ఉన్నాయి. నగలను అమ్మినట్లు శ్వేత పోలీసులకు చెప్పింది. అయితే, పోలీసులు వాటిని రికవరీ చేశారు.
