Delhi: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఇంట్లోకి చొరబడిన యువకుడిని, మహిళా కుటుంబీకులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో ఇన్‌ఫ్లుయెన్సర్ తండ్రి, పొరుగింటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీకి చెందిన నేహా బిష్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉ న్నారు. ఆమె రీల్స్‌కు లక్షలాది వ్యూస్ వస్తుంటాయి. ఇటీవల తన ఎంగేజ్మెంట్‌కు సంబంధించని వీడియోతో పాటు పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన కంటెంట్‌ను ఇన్‌స్టా, యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన అభినవ్ అనే యువకుడు నవంబర్ 7న తూర్పు ఢిల్లీలోని మధు విహార్‌లో ఉన్న నేహా బిష్ట్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో నేహా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించి అభినవ్ తననున పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. అభినవ్ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన నేహా కుటుంబీకులు, పొరుగువారు అతడిపై దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి అభినవ్ వీపు, కుడి పాదంపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా నవంబర్ 15న మృతి చెందాడు. అభినవ్ నేహాను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కూడా ఆమెకు అభిమాని అని చెబుతూ నేహ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. నేహా బిష్ట్ మరో వ్యక్తిని వివాహం చేసుకోబోతుండటంతో అభినవ్ అసంతృప్తికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే, అభినవ్ ఎవరో కూడా నేహాకు తెలియదని పేర్కొన్నారు. ఈ ఘటనలో నేహా బిష్ట్ తండ్రి వీరేందర్ బిష్ట్, ఒక పొరుగింటి వ్యక్తిని అరెస్ట్ చేశారు.

