Delhi Family Brutally Attacked by Goa Resort Staff With Knives: గోవాలో దారుణం చోటు చేసుకుంది. సరదాగా కాలక్షేపం చేద్దామని గోవాకి వచ్చిన ఢిల్లీ కుటుంబంపై.. ఒక దుండగుల ముఠా కత్తులతో దాడి చేసింది. అంజునా ప్రాంతంలోని ‘స్పాజియో లీజర్’ రిసార్టులో ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ దాడి విషయాన్ని బాధితుడు జతిన్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తమపై దాడి జరగడానికి ముందు.. హోటల్ సిబ్బందితో గొడవ జరిగిందని అతడు తెలిపాడు. తమ పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడంతో.. వారిపై తాము హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన వెంటనే సిబ్బందిని తొలగించాడని పేర్కొన్నాడు. అనంతరం తమ కుటుంబం హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద సేదతీరుతుండగా.. కొందరు వ్యక్తులు గేటు వద్ద గుడిగూడి ఉండటాన్ని గమనించామన్నారు. ఆ గుంపులో.. హోటల్‌లో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ దుండగులు తమపై కత్తులతో విరుచుకుపడ్డారని వెల్లడించాడు. ఈ దాడిలో జతిన్‌కి, అతని తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.
Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు.. ‘మహా’మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జతిన్‌పై ఆ దుండగులు దాడి చేస్తున్న సమయంలో.. ఒక మహిళ తమని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని, 324 సెక్షన్‌పై కేసు నమోదు చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే.. కొద్దిసేపటి తర్వాత ఆ నిందితుల్ని పోలీసులు విడుదల చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఖండించిన ఆయన.. దీని వెనుక కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఆయన.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగడంతో.. ఎఫ్ఐఆర్‌కి ఐపీసీ సెక్షన్ 307ని పోలీసులు జోడించారు. విడుదల చేసిన నిందితుల్లో ముగ్గురిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఆ ఫ్యామిలీతో జరిగిన చిన్న గొడవ కారణంగా.. ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Lufthansa Turbulence: విమానంలో కుదుపులు.. 37 వేల నుంచి 4 వేల అడుగులకి ఢమాల్