Drugs: చక్కెర రూపంలో డ్రగ్స్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..

Rwerw

Rwerw

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను భగ్నం చేశారు. అచ్చం తెల్లటి చక్కెర మాదిరిగా కనిపిస్తున్న రూ. 5 కోట్ల విలువైన అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడిని అనుమానాస్పద కదలికల ఆధారంగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఖచ్చితమైన నిఘా సమాచారంతో అక్టోబర్ 30-31 అర్ధరాత్రి కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, నిత్యావసర ఆహార పదార్థాల ప్యాకెట్లలో ఈ సింథటిక్ మిశ్రమాన్ని అత్యంత చాకచక్యంగా దాచిపెట్టినట్లు గుర్తించారు. ప్రాథమిక పరీక్షల్లో అది ఎండీఎంఏతో పాటు ఇతర ప్రాణాంతక సింథటిక్ డ్రగ్స్ మిశ్రమం అని తేలింది. సుమారు 5 కిలోల బరువున్న ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఎన్‌డీపీఎస్ చట్టం-1985 కింద జప్తు చేసి, తదుపరి విచారణ నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. భారీ మొత్తంలో ఉన్న ఈ డ్రగ్స్ యువత చేతుల్లోకి చేరకుండా సమయానికి అడ్డుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దేశంలోని విమానాశ్రయాల్లో ఇలాంటి అసాధారణ అక్రమ రవాణాను అణచివేయడానికి నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.