NTV Telugu Site icon

Srishti Tuli: మహిళా పైలట్ మృతి వెనుక మరో మహిళ.. ఆమె ఎవరంటే..!

Srishtituli

Srishtituli

ఆమెది చిన్న వయసు. కానీ ఆమె ఎంతో మందికి స్ఫూర్తి. కారణం.. చిన్న వయసులోనే మహిళా పైలట్‌గా ఎన్నికై.. తన వెనుకున్న వారికి ఆదర్శంగా నిలిచింది. ఆమె పది మందికి ఆదర్శంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రే స్వయంగా ఆమెను సత్కరించారు. కానీ ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇదంతా ఎవరి కోసమో అర్థమై ఉంటుంది. సోమవారం ముంబైలో శవమైన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి గురించి. ఆమె మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె చనిపోక ముందు వరకు ఉల్లాసంగా.. సంతోషంగా తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడింది. కానీ అంతలోనే ఆమె మరణవార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన సృష్టి తులి (25), ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్ (27) దేశ రాజధానిలో పైలట్ శిక్షణ కేంద్రంలో కలుసుకున్నారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే సృష్టి తులి పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని ఎయిరిండియాలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగ రీత్యా ముంబైకి వచ్చి నివాసం ఉంటుంది. ఇక ఆదిత్య మాత్రం శిక్షణ పూర్తి కాకుండానే డ్రాప్ అయ్యాడు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. కానీ సృష్టి తులితో మాత్రం లవ్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఆదిత్యను ఇష్టపడుతుంది.

అయితే సృష్టి తులిని మొదటి నుంచి మానసికంగా, శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడు. ఒకసారి పార్టీలో సృష్టి తులి నాన్ వెజ్ ఫుడ్ తిందని ఘోరంగా ఆమెను దుర్భాషలాడాడు. అంతేకాకుండా పలుమార్లు మార్గమధ్యలోనే కారు దింపేసి క్రూరంగా వేధించాడు. ఇవన్నీ అతడి మీద ఇష్టంతో భరిస్తూ వచ్చింది. అయితే ఆదిత్య ఈ మధ్య.. సృష్టి తులిని కాకుండా మరో మహిళా పైలట్‌తో కూడా ఎఫైర్ నడిపిస్తున్నాడు. ఈ విషయంలో ఆదిత్య-సృష్టి తులి మధ్య చాలా రోజులుగా గొడవలు.. కొట్లాటలు జరుగుతున్నాయి. ఇక సృష్టి తులి నుంచి కూడా భారీగా నగదు కాజేసినట్లు సమాచారం. గత నెల ఎస్‌బీఐ బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలించగా.. రూ.65,000 ఆదిత్య ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఇలా ఆమెను మానసికంగా వేధించడమే కాకుండా.. ఆమె నగదు వాడుకున్నట్లుగా బాధితురాలి కుటుంబ సభ్యులు గుర్తించారు.

సోమవారం అర్ధరాత్రి ఆదిత్య-సృష్టి తులి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆదిత్య కారులో వెళ్లిపోతుండగా… తులి ఫోన్ చేసి చనిపోతున్నట్లు బెదిరించింది. వెంటనే తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ తలుపులు వేసి ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆదిత్య వెంట మరో మహిళ ఉన్నట్లుగా సమాచారం. ఆమె సహాయంతోనే తలుపులు పగలగొట్టి.. సృ‌ష్టి తులిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మరణవార్తను సృష్టి తులి బంధువులకు ఆదిత్య అందించాడు. దీంతో వారంతా షాక్ అయ్యారు. ఆమె చనిపోక ముందే కుటుంబ సభ్యులతో తులి ఫోన్లో మాట్లాడింది. అప్పుడు ఎలాంటి ఆందోళన గానీ.. ఎలాంటి టెన్షన్ గానీ కనిపించలేదు. ఎప్పటిలాగే మాట్లాడింది. ప్రియుడి ఫోన్ చేసి మరణవార్త చెప్పడంపై బాధిత కుటుంబ సభ్యులకు అనుమానం రేకెత్తింది. ఆదిత్యనే తమ బిడ్డను చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే రూమ్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆదిత్య.. మరో మహిళతో కలిసి సృష్టి తులిని చంపేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.