Site icon NTV Telugu

Cyber Fraud: ఢిల్లీ హైకోర్టు జడ్జి వాట్సాప్ డీపీతో ఘరానా మోసం

Whatsapp Cyber Fraud

Whatsapp Cyber Fraud

Cyber Fraud With Delhi High Court Justice Satish Chandra Sharma WhatsApp DP: సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, జాగ్రత్తలు సూచిస్తున్నా.. అవి ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. జనాలకు కుచ్చటోపీ వేస్తూనే ఉన్నారు. లక్షలు, కోట్ల రూపాయల్ని నిలువునా దోచేస్తున్నారు. జనాలు పక్కాగా నమ్మేలా, కొత్త కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సాప్ డీపీతోనే వీళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ సతీష్ చంద్రశర్మ.. ఇటీవలే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈయన వాట్సాప్ డీపీ నుంచి తెలంగాణ హైకోర్టులో పని చేస్తోన్న శ్రీమన్నారాయణకు ఓ మెసేజ్ వచ్చింది. తానిప్పుడు ఓ సమావేశంలో ఉన్నానని, తనకు రూ. 2 లక్షలు అత్యవసరం ఉన్నాయని, తన దగ్గరున్న కార్డులన్నీ బ్లాక్ అయ్యాయని ఆ మెసేజ్‌లో రాసి ఉంది. అంతేకాదు.. తనకు నేరుగా డబ్బులు పంపొద్దని, రూ. 2 లక్షల విలువ చేసే గినా కార్డుకి సంబంధించిన అమెజాన్ లింక్ పంపుతున్నానని, దాన్ని క్లిక్ చేస్తే తన అకౌంట్‌లోకి డబ్బులు వచ్చిపడతాయని ఆ జడ్జి చెప్పినట్టు సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు.

జస్టిస్ సతీష్ చంద్రశర్మ డీపీ ఉండటంతో.. ఆ మెసేజ్ నిజమేనేమోనని శ్రీమన్నారాయణ నమ్మారు. ఆయనకు డబ్బులు అవసరమేమోనని, అమెజాన్ లింక్‌ని క్లిక్ చేశారు. ఆ తర్వాత ఆయనకు అసలు విషయం తెలిసింది. ఆ మెసేజ్ పంపింది జస్టిష్ సతీష్ కాదని, తాను మోసపోయానని శ్రీమన్నారాయణ గ్రహించారు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇది నైజీరియాల పనిగా భావించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈమధ్య అమెజాన్ గిఫ్ట్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ సూచించారు.

Exit mobile version