Site icon NTV Telugu

Ather Energy: డీలర్‌షిప్ పేరుతో 12.50 లక్షల టోకరా!

Ather Dealdership Fraud

Ather Dealdership Fraud

జనాల్లో ఎలక్ట్రిక్ బైకుల మోజు విపరీతంగా పెరిగింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకేముందు.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి డీలర్‌షిప్ కోసం కొందరు ముందుకొస్తున్నారు. మోసగాళ్లు కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇందుకు తాజా ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యం! డీలర్‌షిప్ పేరుతో ఓ నెరగాడు ఒక వ్యక్తిని రూ. 12.50 లక్షల మేర మోసం చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

అథర్ ఎనర్జీ డీలర్‌షిప్ పేరుతో ఓ సైబర్ నేరగాడు ఇంటర్నెట్‌లో ఒక ప్రకటన ఇచ్చాడు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండికి చెందిన ఓ వ్యక్తి ఆ యాడ్‌ని చూశాడు. ఎలాగూ తాను కొన్ని రోజుల నుంచి డీలర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేస్తుండడం.. అథర్ ఎనర్జీ కూడా ప్రముఖ కంపెనీ కావడంతో.. ఆ యాడ్ నిజమేనని నమ్మి ఫోన్ చేశాడు. దీంతో.. తాను వేసిన గాలంలో చేప దొరికిందని భావించి, ఆ సైబర్ నేరగాడు పన్నుల పేరుతో బాధితుడి నుంచి రూ. 12.50 లక్షల వరకూ వసూలు చేశాడు. డీలర్‌షిప్ మీకు వచ్చిందని, మీ మెయిల్‌కి వివరాలు పంపిస్తామని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

అంతే, అదే ఆ సైబర్ నేరగాడి చివరి ఫోన్ కాల్. ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో బాధితుడు బెంగళూరులోని అథర్ ఎనర్జీ కంపెనీకి వెళ్లి ఆరా తీశాడు. డీలర్‌షిప్‌కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారమూ అందలేదని కంపెనీ వాళ్లు చెప్పారు. ఇది సైబర్ నేరగాళ్ల పనే అయ్యుంటుందని అన్నారు. దీంతో ఆ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version