Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..

Anitha

Anitha

Cyber Crime Recovery Mela: విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలకు గురైన 310 మంది బాధితులకు సుమారు రూ.6 కోట్ల విలువైన రికవరీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఇక, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. అలాగే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తులో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.

చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు

సైబర్ నేరాలకు బాగా చదువుకున్నవారు కూడా బలవుతున్నారని హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల అప్రమత్తత కూడా కీలకమని హోంమంత్రి అన్నారు. ప్రభుత్వం సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతుందని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.