Site icon NTV Telugu

Crime News: తొందరపడి నిర్ణయాలు.. గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు..!

Murder

Murder

Crime News: భార్య, భర్త మధ్య విభేదాలు, మనస్ఫర్థలు.. అనుమానాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కారణాలు ఏవైనా ఒక్కోసారి పరిస్థితులు చేయిదాటి పోతున్నాయి. హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకోవడంతో పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఊర్లో బంధువుల వాదన మాత్రం మరోలా ఉంది. ఎస్సై చంద్రశేఖర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు ఆరోపించి.. ఆయన్ను వెంటపడి తరమడం అనుమానాలకు తావిస్తోంది. కరీంనగర్ టూటౌన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌కు ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యతో 2016లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులున్నారు. కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్నారు ఈ దంపతులు.

అయితే రోజు మాదిరిగానే పిల్లలను స్కూల్లో దింపిన చంద్రశేఖర్.. విధులకు హాజరయ్యేందుకు పీఎస్‌కు వెళ్లారు. బందోబస్తు విధుల్లో ఉండగానే భార్య దివ్య ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసింది. దీంతో హుటాహుటిన వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె గన్నేరుపప్పు దంచుకుని తాగిందని.. చికిత్స చేస్తుండగా మరణించింది దివ్య… ఆమె తండ్రి సమ్మయ్య కూడా కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి సీతంపేటకు తరలించి అంత్యక్రియలు చేశారు.

S*exual Assault: పూజారి ముసుగులో కీచక పనులు.. అమ్మాయిపై అరాచకం..!

అయితే దివ్య మరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. అంత్యక్రియలకు హాజరైన చంద్రశేఖర్‌‌పై దాడి జరుగుతుందనే సమాచారంతో అతన్ని ఓ ఇంట్లో దాచి అక్కడ నుంచి పోలీసులు తప్పించారనే ఆగ్రహించారు గ్రామస్తులు. దివ్య మరణం వెనక ఏం జరిగిందనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. అసలు గన్నేరు పప్పు ఎక్కడ లభ్యం అయింది? గన్నేరుపప్పు తింటే వెంటనే చనిపోతారా? అనేది అనుమానాలకు తావిస్తోంది. చంద్రశేఖర్.. దివ్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయనే టాక్ కూడా నడుస్తోంది. అయితే దివ్య తండ్రే కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు ఇవ్వడం వెనక ఏం జరిగిందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. అది వస్తే గాని ఆత్మహత్య ఎలా జరిగిందనేది తేలే అవకాశాలున్నాయంటున్నారు.

మరోవైపు హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రి, కూతురు సజీవ దహనమయ్యారు. ఈ ఫోటోలో ఉన్న ఈ దంపతుల పేర్లు ప్రవీణ్, రాజశ్రీ. వీళ్లకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. ఐతే ఇంట్లో నిద్రిస్తున్న రాజశ్రీ, ఆమె తండ్రి రాజశేఖర్ ఉన్నట్టుండి సజీవ దహనం అయ్యారు. తండ్రి, కూతురు విద్యుత్ ప్రమాదంలో చనిపోయారని అల్లుడు ప్రవీణ్.. బంధుమిత్రులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. బంధుమిత్రులు ఏం ప్రమాదం జరిగిందో.. ఎలా చనిపోయారో అనే ఆందోళనతో పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రమాదం కాదని.. ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్స్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు ప్రవీణ్.. తన భార్య రాజశ్రీ, ఆమె తండ్రి రాజశేఖర్‌‌ని మొదట చంపి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు గుర్తించారు.

చింతల్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కు.. రాజీవ్ గృహకల్పకు చెందిన రాజశ్రీతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యభర్త మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. అయితే ప్రవీణ్‌ ఏ పని లేకుండా తిరగడం స్టార్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న రాజశ్రీ తండ్రి రాజశేఖర్ కూతురి ఇంటికి వచ్చి అల్లుడు ప్రవీణ్‌ను మందలించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన అల్లుడు.. తన భార్య, మామ ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల

మరో ఘటనలో భార్యపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు భర్త. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో కలకలం రేపింది. కొత్తగుంపులో వీరబోయిన నరేష్, విజయ దంపతులు నివసిస్తున్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్యాంటిన్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కొన్ని రోజులుగా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో భార్య.. భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను అనుమానిస్తున్న భర్త ఎప్పుడూ.. ఆమెతో ఘర్షణ పడుతున్నాడు.

ఉగాది పండుగ రోజు భార్య భర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన విజయ భర్త నరేష్.. కొబ్బరి బోండాలను కట్ చేసే కత్తితో విజయపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మెడ, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు నరేష్. తొలుత విజయను మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ విజయకు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ.. తీవ్ర గాయాలతో పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని MGM ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version