NTV Telugu Site icon

Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌పై కొడుకు దాడి

Chennai

Chennai

తల్లిపై బిడ్డలకు మమకారం ఉంటుంది. మాతృమూర్తికి కష్టం వస్తే పేగు పంచుకుని పుట్టిన బిడ్డలు సహించలేరు. ఆ గుండెలు తల్లడిల్లిపోతాయి. కారణం.. తల్లి, బిడ్డల మధ్య ఉండే రిలేషన్ అలాంటిది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.

కన్నతల్లికి సరైన వైద్యం చేయలేదని డాక్టర్‌పై ఓ కొడుకు పగ పెంచుకున్నాడు. అదునుకోసం ఎదురుచూస్తున్న కుమారుడు.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి వైద్యుడ్ని కత్తితో పొడిచాడు. పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

విఘ్నేష్ అనే వ్యక్తి.. తన తల్లికి జరుగుతున్న కేన్సర్ చికిత్సపై అసంతృప్తిగా ఉన్నాడు. 2024, మే నెల నుంచి కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. అయితే తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు. వైద్యుడు సరైన మందులు రాయడంలేదన్న అనుమానంతో డాక్టర్‌పై కోపం పెంచుకున్నాడు. దీంతో నవంబర్ 13న (బుధవారం) డాక్టర్ బాలాజీ కేన్సర్ వార్డులో పనిలో నిమగ్నమైయున్నాడు. ఇంతలో విఘ్నేష్ అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించి కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. విఘ్నేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన తల్లికి సరైన వైద్యం చేయలేదన్న అనుమానంతో డాక్టర్ బాలాజీపై దాడి చేశాడని అధికారి తెలిపారు. బాలాజీ హార్ట్ పేషెంట్ అని చెప్పారు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. గాయపడిన వైద్యుడికి అవసరమైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమయంతో నిమిత్తం లేకుండా సేవలు అందిస్తోన్న వైద్యుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

Show comments