Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!

Sajir Palli Mopam

Sajir Palli Mopam

Delhi Gang Rape Case: దేశ రాజధానిలో యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి విదేశాలకు పారిపోయిన కరుడుగట్టిన నిందితుడి ఆటకట్టింది. గల్ఫ్ దేశంలో తలదాచుకున్న కామాంధుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) భారత్‌కు రప్పించింది. ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి మేరకు కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేసిన సీబీఐ.. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఎదుర్కొంటున్న సజీర్ పల్లి మోపమ్‌ను యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి బుధవారం విజయవంతంగా ఢిల్లీకి తరలించింది.

ఢిల్లీ పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. నిందితుడు సజీర్ పల్లి మోపమ్ తన సహచరుడితో కలిసి ఓ 20 ఏళ్ల యువతికి బలవంతంగా మత్తుమందు తాగించాడు. స్పృహతప్పి నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని ఓ ప్రైవేట్ హోటల్‌కు తరలించాడు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఫేక్ ఐడీలు ఉపయోగించి హోటల్‌లో గదిని తీసుకున్నాడు. అనంతరం ఆమెపై విచక్షణారహితంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. వైద్య, ఫోరెన్సిక్ నివేదికల్లోనూ ఈ దారుణం రుజువైంది. దీనిపై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సంబంధిత న్యాయస్థానంలో పకడ్బందీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

నేరం జరిగిన వెంటనే దేశం విడిచి పారిపోయిన నిందితుడిపై ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు సీబీఐ ఇంటర్‌పోల్ ద్వారా ‘రెడ్ నోటీస్’ జారీ చేయించింది. భారత్‌లోని ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అందించిన సమాచారంతో యూఏఈ భద్రతా బలగాలు నిందితుడి ఆచూకీ కనిపెట్టి అక్కడే అరెస్ట్ చేశాయి. న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో యూఏఈ ప్రభుత్వం అతడిని భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక ఎస్కార్ట్ బృందం యూఏఈకి వెళ్లింది. అక్కడ అధికారిక లాంఛనాల అనంతరం సజీర్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. భారత్‌లో ఇంటర్‌పోల్ వ్యవహారాలను పర్యవేక్షించే నేషనల్ సెంట్రల్ బ్యూరోగా సీబీఐ కీలక పాత్ర పోషిస్తోంది. ‘భారత్‌పోల్’ వేదిక ద్వారా దేశంలోని దర్యాప్తు సంస్థలన్నింటినీ అనుసంధానిస్తూ, విదేశీ భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటోంది. తీవ్ర నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన పరారీ నేరగాళ్లను రప్పించడంలో భారత్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 278 మందికి పైగా అంతర్జాతీయ పరారీ నేరస్థులను విజయవంతంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.