ప్రపంచంలో ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేసేది డబ్బు.. ఇక ఏ కష్టంలేకుండా ఫ్రీగా డబ్బు వస్తుంటే దారుణానికి ఏంటి ఎంతటి నీచానికైనా దిగజారుతారు కొందరు.. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చే వస్తువుల కోసం ఆశపడి సొంత చెల్లిని పెళ్లాడాడు ఒక ప్రబుద్దుడు.. అందరు చూస్తుండగా తోడబుట్టిన చెల్లి మెడలో మూడు ముళ్ళు వేసి ప్రభుత్వ లాంఛనాలను అందుకొని పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 11 న నిర్వహించిన సామూహిక వివాహంలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం డబ్బు, ఇతర సౌకర్యాలను అందజేస్తోంది. ఇక వీటి కోసం ఆశపడిన ఒక వ్యక్తి ఆ వివాహంలో పాల్గొనడానికి నీచానికి ఒడిగట్టాడు. సొంత చెల్లిని పెళ్లికూతురిగా మార్చి వివాహానికి హాజరయ్యాడు. అందరిలానే చెల్లి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు.. అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు, ఇతర సౌకర్యాలను అందుకున్నాడు. ఇక ఈ దరిద్రమైన ఐడియాకు గ్రామస్థులు సైతం వత్తాసు పలకడం గమనార్హం. అయితే ఇటీవల వారి ఆధార్ కార్డులను పరిశీలించిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ అధికారి చంద్రభాన్ సింగ్ వారిద్దరూ అన్నాచెల్లెలు గా గుర్తించడంతో విషయం బయటపడింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గృహోపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు.
