Site icon NTV Telugu

Haryana: ముఖ్యమంత్రి సన్నిహితుడు, బీజేపీ నేత దారుణహత్య

Sukhbir Khatana

Sukhbir Khatana

Haryana: హర్యానాలో బీజేపీ నేత, ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సుఖ్‌బీర్‌ ఖతానాపై తూటాల వర్షం కురిపించారు. సుఖ్‌బీర్‌ ఖతానాను అందరూ సుఖిగా పిలుస్తారు. కాగా ఆయన హత్య గురించి తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. రితోజ్ గ్రామానికి చెందిన సుఖి నిన్న తన స్నేహితుడితో కలిసి గురుగ్రామ్ సదర్ బజార్ ప్రాంతంలోని ఓ క్లాత్ షోరూముకు వెళ్లారు. అక్కడే కాచుకుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గాయపడిన ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

Fire Accident: లారీలో పేలిన 300కు పైగా గ్యాస్ సిలిండర్లు.. పూర్తిగా రోడ్డు ధ్వంసం

సోహనా మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడైన సుఖ్‌బీర్‌ ఖతానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండగానే ఈ ఘటన జరిగింది. స్నేహితుడు రాజేందర్‌తో కలిసి కారులో గురుద్వారా రోడ్డులోని రేమండ్ షోరూమ్‌కు సుఖి వెళ్లగా మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన తర్వాత అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు క్లాత్ షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు బ్లాక్ టి షర్టులు ధరించగా, ఒకరు వైట్ చెక్ షర్ట్, మరొకరు క్యాప్, మరొకరు రెడ్ షర్ట్ ధరించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సుఖ్‌బీర్‌ ఖతానా అత్యంత సన్నిహితుడు.

Exit mobile version