NTV Telugu Site icon

Bengaluru: “మాజీ ప్రియురాలి” ఇంటిని తగలబెట్టిన వ్యక్తి.. కార్లు, బైకులకు నిప్పు..

B'luru

B'luru

Bengaluru: తాను ప్రేమించిన అమ్మాయి దూరమైందనే కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సదరు అమ్మాయి తండ్రి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన దక్షిణ బెంగళూర్‌లో జరిగింది. మొత్తం మూడు కార్లను తగులబెట్టడంతో పాటు ఒక బైక్‌ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మూడు కార్లలో రెండు అమ్మాయి తల్లిదండ్రులవి కాగా, బైక్ ఆమె సోదరుడిది. నిందితుడు లక్ష్యంగా చేసుకున్న రెండు కార్ల పక్కన మరో కారు ఉండటంతో అది కూడా తగలబడింది. ఈ మొత్తం ఘటన అక్కడే ఉన్న సీనీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

ఈ సంఘటన చన్నమనకెరె అచ్చుకాటు, సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది. నిందితుడిని రాహుల్ అలియాస్ స్టార్ రాహుల్‌గా గుర్తించారు. ఇతడికి నేర చరిత్ర ఉంది. నిందితుడిపై 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాహుల్‌పై హత్యాయత్నం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ వంటి కేసులు నమోదయ్యాయి. కులు రిజ్వాన్ అనే రౌడీ షీటర్‌కి రాహుల్ అత్యంత సన్నిహితుడని సమాచారం. రాహుల్ 2002 జనవరిలో పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ, అతడి కాళ్లపై కాల్పులు జరిపారు.

Read Also: Sambhal Mosque: ఏఎస్ఐ అనుమతి లేకుండా “సంభాల్ మసీదు”లో ఎలాంటి పనులు జరగకూడదు..

రాహుల్, అతడి గ్యాంగ్ కార్లను తగలబెట్టడానికి ముందు వాటి అద్దాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాహుల్ సదరు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆ అమ్మాయిని తన నుంచి కుటుంబం దూరం చేసిందనే కోపంతో రాహుల్, తన ముగ్గురు సహచరులతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అమ్మాయి తండ్రి ఇంటికి వెళ్లి, ఆమె సోదరుడిపై దాడి చేశాడు. కుటుంబమే తన నుంచి ఆమె నుంచి వేరు చేసిందని ఆరోపించాడు.

వాహనాల ధ్వంసం తర్వాత, రాహుల్ అమ్మాయి, ఆమె తల్లి నివాసం ఉంటున్న ఆరెహల్లి లోని ఒక అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అక్కడ అమ్మాయితో మాట్లాడలేకపోవడంతో ఆమె తల్లి కారుకు కూడా నిప్పు పెట్టారు. నిందితులు సొసైటీ వాచ్‌మెన్‌పై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.