live-in relationship: శ్రద్ధా వాకర్ దారుణ హత్య.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లోని భయంకర కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అతి కిరాతకంగా నరికి ఫ్రిజులో పెట్టిన సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న పలువురు యువతులు హత్యలకు గురవ్వడమో, లేకపోతే హింసించబడటమో జరిగింది. లివ్ ఇన్ లో ఉన్న యువతులు తమను పెళ్లి చేసుకోవాలని కోరడం హత్యలకు దారి తీశాయి. కొన్ని కేసుల్లో తమ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటామని వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇదిలా ఉంటే మరో లివ్ -ఇన్ రిలేషన్ దారుణం వెలుగులోకి వచ్చింది. నమ్మి సహజీవనం చేసిన యువతికి సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టాడు ఆమె లవర్. 26 ఏళ్ల యువకుడు తన ప్రియురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర చిత్రాలుగా రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన బెంగళూర్ లో జరిగింది. ఇది గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు.
Read Also: China: పిల్లల్ని కనడం మానేసిన చైనా ప్రజలు.. రికార్డ్ స్థాయిలో తగ్గిన జననాలు..
తమిళనాడులోని వేలూరుకి చెందిన సంజయ్, అతని స్నేహితురాలు ఇద్దరూ లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరు బెంగళూర్ లో నివసిస్తున్నారు. ఇద్దరు 10వ తరగతి నుంచి ఒకరికొకరు తెలుసు. వీరి బంధం తెలుసుకుని కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఏర్పాట్లు చేశారు.
2021లో ఇన్‌స్టాగ్రామ్ లో సదరు యువతికి సంబంధించిన మార్ఫింగ్ ఫోటో ప్రత్యక్షమైంది. దీనిపై ఫిర్యాదు చేయగా, దాన్ని తొలగించారు. అయితే 2023 జూన్ నెలలో ఇలాగే మరో మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయింది. దీంతో సంజయ్ మరియు అతని ప్రియురాలు ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ మార్ఫింగ్ ఫోటోల వెనక సంజయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. BOT యాప్ ఉపయోగించి అతను యువతి ఫోటోలను 12 మంది వ్యక్తులతో టెలిగ్రామ్ లో పంచుకున్నాడు. ఇలా వందల మంది ఫోటోలు షేర్ చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
