Ayodhya Gangrape Case: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. ఇతను భద్రస నగర ఎస్పీ అధ్యక్షుడు. ఇతడితో పాటు ఇతనికి సంబంధించిన ఖాన్ బేకరీలో పనిచేసే రాజు ఖాన్ మరో నిందితుడు. దీంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిందితుడి బేకరీని, ఆస్తుల్ని యోగి ప్రభుత్వం బుల్డోజర్‌లతో కూల్చేసింది. నిందితుడు మోయిద్ ఖాన్, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య ఫైజాబాద్ నుంచి గెలిచిన ఎస్పీ నేత, ఎంపీ అవధేష్ ప్రసాద్‌కి అత్యంత సన్నిహితుడు. ఇతని తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాడు.
Read Also: Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో పొత్తుపై చర్చ
ఈ కేసులో 12 ఏళ్ల బాలిక కుటుంబం ఆమె 12 వారాల గర్భాన్ని తొలగించడానికి సమ్మతించింది. మంగళవారం కేజీఎంయూలోని క్వీన్ మెరీ ఆస్పత్రిలో ఆమెకు అబార్షన్ జరిగింది. అయితే, ఈ కేసులో అసలైన నిందితుడిని గుర్తించేందుకు పిండం యొక్క డీఎన్ఏని పరీక్ష కోసం తీసుకున్నారు. ఇది నేరస్తుల్ని గుర్తించేందుకు ఉపయోగపడనుంది. నిందితుడిపై కేసును బలపరిచేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. బాధితురాలిని సోమవారం అయోధ్య నుంచి లక్నోకి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. బాలిక సంరక్షణ కోసం ఒక మహిళా సహాయకురాలిని నియమించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (అయోధ్య) చైర్‌పర్సన్ సర్వేష్ అవస్తీ తెలిపారు. పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం నియమించబడిన వ్యక్తి అమ్మాయికి మద్దతుగా ఉంటారని వెల్లడించారు.
మోయిద్ ఖాన్, అతని ఉద్యోగి రాజుఖాన్ మూడు నెలల క్రితం 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత రెండు నెలలు కూడా బాలికను లైంగికంగా వేధించారు. ఆమెను బెదిరించేందుకు లైంగిక దాడి సమయంలో తీసిన వీడియోలను ఉపయోగించారు. మోయిద్ ఖాన్‌కి రాజు ఖాన్ సాయం చేశాడు. మైనర్ గర్భవతి అని తేలడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. జూలై 30న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ సీఎం యోగి బాధితురాలి తల్లిని కలుసుకుని ఆమెకు న్యాయం చేస్తానమని హామీ ఇచ్చారు.